Mon Dec 23 2024 16:25:13 GMT+0000 (Coordinated Universal Time)
రాజశేఖర్ అంటూ ఈయన... అన్నా.. అంటూ ఆయన
కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ హయాంలో అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. అందరి ప్రశంసలను పొందారు
నాయకుడనే వాడికి డాంబికం ఉండకూడదు. ఇగో అసలు ఫీల్ కాకూడదు. తనకే అంతా తెలుసునన్న గర్వం ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ రోశయ్యలో పుష్కలంగా ఉన్నాయి. కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ హయాంలో అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య, నేదరుమిల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా అందరి ముఖ్యమంత్రుల మన్ననలను పొందారు.
ఇద్దరి అనుబంధం....
కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయనకు విడదీయలేని అనుబంధం. ఇద్దరూ కష్టపడి పార్టీలో పైకి ఎదిగిన వారే. స్వయంశక్తి ఇద్దరినీ నాయకులుగా చేసింది. వైఎస్ అనేక కష్టాలకోర్చి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోగా, కాంగ్రెస్ అధినాయకత్వానికి నమ్మకమైన నేతగా రోశయ్య అనేక కీలకపదవులు పొందారు. వైఎస్ హయాంలో రోశయ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వైఎస్ జిల్లాల పర్యటనలకు వెళితే తన గుండె ఝల్లుమంటుందని రోశయ్య అసెంబ్లీలో చెప్పడం అందరికీ నవ్వు తెప్పించింది.
వైఎస్ మరణంతో...
వైఎస్ ఇచ్చే హామీలు, అమలు చేస్తున్న పథకాలతో ఖజానా బోసి పోకుండా కాపాడటంలో రోశయ్య చాతుర్యం చూపేవారు. అదే స్థాయిలో వైఎస్ కూడా రోశయ్య మీద అంత నమ్మకం ఉంచేవారు. రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నారన్న భరోసాతోనే వైఎస్ రోజూ కంటినిండా నిద్రపోయేవారని కూడా చెబుతారు. వైఎస్ హెలికాప్టర్ లో వెళుతూ కన్పించకుండా పోయినప్పుడు రోశయ్య సెక్రటేరియట్ లో కూర్చుని విలవిలలాడిపోయారు. తన స్నేహితుడు క్షేమంగా తిరిగివస్తాడంటూ ఆశతో ఎదురు చూపులు చూశారు.
అప్పట్లో ఎన్టీఆర్ కూడా..
రోశయ్య మాట కటువుగా ఉన్నా మనసు వెన్న అంటారు. పదహారుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో ఏడుసార్లు వరసగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి అరుదైన ఘనతను సాధించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి అగ్రనేతలో నేరుగా సంబంధాలున్నా ఏనాడూ ఆయన దుర్వినియోగం చేయలేదు. రోశయ్య రాజకీయ విలువలు పాటించేవారు. ఎన్టీఆర్ కూడా రోశయ్య ప్రసంగాన్ని ఆసక్తిగా వినేవారు. వైఎస్ రోశయ్యను అన్నా అని పిలిచే వారు. అలాగే వైస్ ను రాజశేఖర్ అని అప్యాయంగా రోశయ్య అనేవారు.
Next Story