Mon Dec 23 2024 09:08:42 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే ఒక్కడు.. ఎదురు తిరుగుతాడా?
ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు
అధికార పార్టీలో అసంతృప్తి అనేది సహజమే. కానీ దానిని తొలగించాల్సిన బాధ్యత పార్టీ హైకమాండ్ మీద ఉంది. ఒకటికి రెండు సార్లు అసంతృప్త నేతలను పిలిపించుకుని వారితో చర్చించాలి. అవసరమైతే వారిని బుజ్జగించాల్సి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా జగన్ టీం వారిని పిలిచి బుజ్జగించింది. బాలినేని శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలతో సజ్జల రామకృష్ణారెడ్డి బృందం చర్చలు జరిపింది. జగన్ కూడా వారితో భేటీ అవ్వడంతో కొంత శాంతించారు. కానీ బయటపడని నేతలు అనేక మంది ఉన్నారు. వారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు.
వైసీపీలోకి తొలి నేతగా....
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీలోకి వచ్చిన తొలి నేతగా చెప్పుకోవచ్చు. జగన్ వెంట నడిచారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి వచ్చిన తొలి నేత ఆయనే. అందుకే ఆయనను తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఆయన ఆ పదవి పట్ల అంత సీరియస్ గా లేరని తెలిసి ఆయనను తప్పించి కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ నియమించారు. 2014లో కోవూరు వైసీపీ నుంచి పోటీ చేసిన నల్లపురెడ్డి ఓటమి పాలయ్యారు. జగన్ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది.
తొలి మంత్రి వర్గంలోనే...
తొలి మంత్రి వర్గంలోనే తనకు స్థానం దక్కుతుందని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి భావించారు. సీనియర్ నేతగా. వైఎస్ కుటుంబానికి నమ్మకమైన నేతగా ముద్రపడిన తనకు మంత్రి పదవి ఎందుకు రాదన్న ధీమాతో ఉన్నారు. కానీ తొలి విడత జగన్ నల్లపురెడ్డికి ఝలక్ ఇచ్చారు. గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. రెండో విడత గ్యారంటీ అనుకున్నారు. కానీ ఈసారి కూడా జగన్ ఆయనకు మొండి చేయి చూపారు. దీంతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రంగా మనస్థాపానికి చెందినట్లు తెలుస్తోంది. రెండో విడత మంత్రి వర్గ విస్తరణ జరిగి నెలలు గడుస్తున్నా ఆయన దాని నుంచి బయటకు రావడం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా అంతంత మాత్రమే.
గడప గడపకు ప్రభుత్వం....
జగన్ ప్రభుత్వం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. కానీ కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అసలు ప్రారంభించలేదు. లైట్ తీసుకున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాన్ని పక్కన పెట్టారు. కానీ జగన్ నుంచి పిలుపు లేదు. ఆయన ఎందుకు అసహనంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ హైకమాండ్ పట్ల మరింత అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఆయన జగన్ ను కలుసుకునే ప్రయత్నమూ చేయడం లేదు. నెల్లూరు జిల్లాలో తన కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసహనం ఆయనలో కనపడుతుంది. జగన్ ఆయనను దూరం చేసుకోదలచుకున్నారా? లేక ఆయనే దూరం కావడానికి సిద్దపడుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
Next Story