Fri Nov 15 2024 03:25:23 GMT+0000 (Coordinated Universal Time)
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ...నవ్వుతూ...?
కృష్ణ అంటే ఒక వెరైటీ. సినిమా పేర్లలోనూ ఆయన విలక్షణంగా ఎంపిక చేసుకునే వారు. పాటల ఎంపికలోనూ ప్రత్యేకత కనపర్చేవారు
కృష్ణ అంటే ఒక వెరైటీ. సినిమా పేర్లలోనూ ఆయన విలక్షణంగా ఎంపిక చేసుకునే వారు. పాటల ఎంపికలోనూ ప్రత్యేకత కనపర్చేవారు. ఆయన పాటల్లో ఎక్కువ భాగం సూపర్ డూపర్ హిట్లే. నాడు కృష్ణా సినిమా పాటల క్యాసెట్లు అమ్ముడు పోయినట్లు మరేవీ అమ్ముడు పోయేవి కావు. అదే సమయంలో ఆయన సినిమాల పాటల పుస్తకాలను కూడా అభిమానులు పదిలంగా దాచుకునే వారు. తనివి తీరలేదే.. పాట నుంచి సింహాసనం జింతాన జింతానా పాట వరకూ ఆయన పాటల ఎంపిక పై ప్రత్యేకత కనపర్చే వారంటారు.
పాటలతోనే హిట్...
దేవదాసు రీమేక్ చేసినా ఆయన పాటలతో సినిమా హిట్ చేశారంటారు. కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది పాట అప్పట్లో ప్రతి చోట వినిపించేది. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, మీనా వంటి సినిమాల్లో పాటలు ఇప్పటికీ వీనుల విందుగా వినిపిస్తునే ఉంటాయి. మీనాలోని వస్తాడు నా రాజు ఈరోజు పాట కాని, పండంటి కాపురంలోని "మనసా కవ్వించకే" "ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు", "ఏమమ్మా జగడాల వదినమ్మో" " బాబూ వినరా" వంటి పాటలు నాటి తరం మరిచిపోలేనివి. ఊరికి మొనగాడులో "ఇదిగో తెల్లచీర.. అదిగో మల్లెపూలు" వంటి పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
మైకుల్లో మార్మోగే...
మాయదారి మల్లిగాడు లో" మల్లెపందిరి నీడలోనా జాబిల్లి" "నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ.. నవ్వుతూ చావాలిరా" వంటి పాటలు ఇప్పటికీ వినాలనిపించేవే. కృష్ణ నటించిన ఏ సినిమాలో అయినా పాటలే హైలెట్. సంగీతం పట్ల ఆయన అంత శ్రద్ధ తీసుకునే వారంటారు. అప్పట్లో గ్రామ్ ఫోనర్ రికార్డులు, ఆ తర్వాత క్యాసెట్ల కాలంలోనూ కృష్ణ సినిమాల పాటలు రికార్డులను బ్రేక్ చేశాయనే చెప్పాలి. పాటల పట్ల కృష్ణ ఎంత శ్రద్ధ తీసుకుంటారో సినిమా పేర్లపై కూడా అదే స్థాయిలో కృష్ణ దృష్టి పెట్టేవారు. కృష్ణ సినిమాలకు వెళ్లేవారికి కనుల విందుతో పాటు వీనుల విందు కూడా లభించేది. కొన్ని సినిమాలు హిట్ కావచ్చు. మరికొన్ని సినిమాలు ప్లాప్ కావచ్చు. కానీ ఆయన సినిమాల్లో పాటలు మాత్రం ఎప్పుడూ హిట్ అయ్యేవి. పెళ్లి పందిర్లలోనూ అప్పట్లో మైకుల్లో కృష్ణ సినిమా పాటలు మార్మోగేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి పాటలను ప్రేక్షకులకు అందించేవారు కృష్ణ.
పేర్లతోనూ...
నాటి ఘంటసాల నుంచి రాజ్ సీతారాం వరకూ కృష్ణ సినిమాలో పాటలు అందరినీ అలరించాయి. కృష్ణ సినిమాలకు కేవలం పాటల కోసం వెళ్లే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పేర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. గూడు పుఠాణి, మోసగాళ్లకు మోసగాడు, హంతకులు దేవాంతకులు, మంచివాళ్లకు మంచివాడు, మాయదారి మల్లిగాడు, చీకటి వెలుగులు, ఊరికి మొనగాడు, సింహాసనం, అన్నదమ్ముల సవాల్, కుమారరాజా, సింహగర్జన, వియ్యాల వారి కయ్యాలు, కొత్తపేట రౌడీ, అమ్మాయికి మొగుడు - మామకు యముడు, కృష్ణార్జునులు వంటి పేర్లతో అందరినీ ఆకట్టుకున్నారు.
Next Story