సమరభేరి కాదు... అది అసమర్థభేరి
కరీంనగర్ లో అమిత్ షా పెట్టింది సమరభేరి సభ కాదని, అసమర్ధభేరి అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదని, తాము కట్టిన పన్నులనే కేంద్రం తిరిగి ఇస్తుందని, అటువంటప్పుడు కేంద్రం నిధులు ఇస్తోందనే అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టకుని తెలంగాణకు వచ్చారని ప్రశ్నించారు. ఓ వైపు నరేంద్ర మోదీ సహా ఇతర బీజేపీ నేతలు కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతుంటే ఎన్నికల కోసం చుట్టపు చూపుగా వచ్చిన అమిత్ షా విమర్శించడం సరికాదన్నారు. కేంద్రం తమకు ఏ విషయంలోనూ సహకరించకున్నా అన్ని రంగాల్లోనూ తాము ముందుకు పోయామన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం శీతకన్ను, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. రామ్ మందిర్ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చి రామ్ మందిర్ కట్టలేదన్నారు. మనుషులను మోసం చేసిన పార్టీలు ఉన్నాయని కానీ దేవుడిని మోసం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని విమర్శించారు. కేంద్రం అమలుచేయని పథకాల గురించి తాము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో వారికి తెలియదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.