చంద్రబాబుపై కేటీఆర్ పంచ్ లివే...!!
చంద్రబాబు నాయుడులా మా జబ్బలు మాకు చచ్చుకునే అలవాటు లేదని, చంద్రబాబు నాయుడు... హైదరాబాద్ నేనే కట్టాను, నేనే కనిపెట్టాను. చార్మినార్ కి ముగ్గు పోశాను, సాలార్ జంగ్ మ్యూజియం నేనే కట్టాను, హైకోర్టు నేనే కట్టాను అని చెప్పుకుంటే 2004లోనే ఆయన మాటలను ప్రజలు నమ్మలేదని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు డబ్బా కొట్టుకుంటూ నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే మౌజ్ కనిపెట్టాను అంటే ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని పథకాలు అమలు చేస్తూ, ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుభవం ఉండవచ్చు గానీ ఆయన పరిపాలన వదిలేసి గిలికజ్జాలు పెట్టుకున్నారని, కేసీఆర్ మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారని తమ రాజకీయ శ్రతువు అయిన నరేంద్ర మోదీ అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మాదిరిగా మా గొప్పలు మేము చెప్పుకునే ఖర్మ పట్టలేదని పేర్కొన్నారు.
- తాను ఉద్యోగం వదిలి ఉద్యమం ప్రారంభించిన నాడు తెలంగాణ వస్తే చాలనుకున్నాను, ఏనాడూ మంత్రి అవుతానని అనుకోలేదు. 2014లో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దయ వల్ల కలలో కూడా అనుకోకుండా మంత్రి అయ్యాను. ఈ పదవే నాకు ఎక్కువ. ఇంతకంటే పెద్ద పదవిలోకి వెళ్లాలనే దురాశ నాకు లేదు. కేసీఆర్ వంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనే కల మాత్రం ఉంది.
- సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 7 సర్వేల ఫలితాలు వస్తే 6 సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని తేలింది. అసలు సర్వే డిసెంబర్ 7న వస్తుందని, ప్రజలపై మాకు విశ్వాసం ఉంది. టీఆర్ఎస్ పార్టీ డిసెంబర్ 11న చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేయబోతోంది.