మార్చేది లేదు... ఇక మీ ఇష్టం..!
టీఆర్ఎస్ లో టిక్కెట్ల లొల్లికి చెక్ పెట్టాలని పార్టీ పెద్దలు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. పార్టీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న వారిని నియోజకవర్గాల వారీగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అభ్యర్థులను సైతం పిలిపించి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇది సఫలమవుతున్నా.. ఎక్కువగా విఫలమవుతోంది. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను పూర్తిగా తలకెత్తుకున్న మంత్రి కేటీఆర్ గత 20 రోజులుగా ప్రతీరోజు గంటల తరబడి ఇదే పనిలో ఉన్నారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలకు నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ వంటి హామీలు ఇస్తున్నారు. అయితే, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయితీ ఎంతకూ తెగకపోవడంతో కేటీఆర్ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా తేల్చాశారు.
ఇంకా తెగని ఘనపూర్ పంచాయతీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పంచాయతీ చాలా రోజులుగానే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ టిక్కెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకే కేసీఆర్ మళ్లీ ఖాయం చేశారు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మరో ఆశావహుడు రాజారపు ప్రతాప్ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఈ టిక్కెట్ ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. రాజయ్యపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయన ఓడిపోతారని కడియం వర్గీయులు వాదిస్తున్నారు. దీంతో కేటీఆర్ వారితో పాటు అభ్యర్థి రాజయ్యను సోమవారం హైదరాబాద్ పిలిపించుకున్నారు. నాలుగు గంటల పాటు వారందరికీ నచ్చజెప్పి పార్టీని గెలిపించుకోవడాలని సూచించారు. మంత్రి పదవి నుంచి తొలగించినా రాజయ్య పార్టీకి వ్యతిరేకం కాకుండా నమ్మకంగా ఉన్నందునే కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇచ్చారని, కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఆయనను గెలిపిస్తుందని కేటీఆర్ వారికి చెప్పారు. కానీ, తాము రాజయ్య కోసం పనిచేయలేమని కడియం సహా ఆయన వర్గీయులు స్పష్టం చేశారు.
మారిస్తే కొత్త తలనొప్పులే...
ఇదే పరిస్థితి అనేక నియోజకవర్గాల్లో ఉంది. దీంతో ఈ సమస్యను ఇంకా తాత్సారం చేస్తే అసంతృప్తులు ఇంకా పెరిగి పార్టీకి ఇబ్బందిగా మారుతుందని టీఆర్ఎస్ పెద్దలు భావించారు. ఒకవేళ ఒత్తిడి లొంగి ఎక్కడైనా అభ్యర్థిని మార్చినా ఈ డిమాండ్ ఇంకా పెరిగి తలనొప్పిగా మారుతుందని అంచనా వేశారు. దీంతో అభ్యర్థుల మార్పు ఎట్టి పరిస్థితిలో ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నిన్న స్టేషన్ ఘనపూర్ నేతలకు కూడా కేటీఆర్ తేల్చిచెప్పారు. అభ్యర్థులను మార్చలేమని, కలిసి పనిచేసుకోవాలని.. లేదా మీ ఇష్టం.. అని ఆయన వారికి స్పష్టం చేశారు. దీంతో అసంతృప్తుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇదే విషయాన్ని ఇతర నియోజకవర్గాల నేతలకు కూడా ఆయన చెబుతున్నారు. దీంతో ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల బెడద తగ్గుతుందో లేదో చూడాలి. మరోవైపు ఇంకా ప్రకటించని 14 సీట్ల అభ్యర్థులపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలను ఖాయం చేశారు. మంత్రి కేటీఆర్ వారికి నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. మరో ఒకటిరెండు రోజుల్లో 14 మంది అభ్యర్థుల లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.