Wed Dec 25 2024 02:18:35 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పం తో పోయేదేమిటి? వచ్చేదేమిటి?
కుప్పం మున్సిపాలిటీ చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉంది.. చంద్రబాబు ఈ ఎన్నికను తొలి నుంచి సీరియస్ గా తీసుకున్నారు
ఒక మున్సిపాలిటీ... తిప్పి తప్పి కొడితే 40 వేల మంది ఓటర్లు లేరు. అయినా ఎందుకీ హడావిడి? ఎందుకీ తాపత్రయం? అధికార, విపక్ష పార్టీలు కుప్పం మున్సిపాలిటీ ఎందుకింత పట్టుదలకు పోతున్నాయి? రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలకు, నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతుండగా కుప్పంలోనే ఎందుకింత టెన్షన్ ఉంది. కావాలనే చేస్తున్నారా? లేక సానుభూతిని పొందే ప్రయత్నమా? ఒక్క మున్సిపాలిటీతో పోయేదేమిటి? వచ్చేదేమిటి?
సొంత నియోజకవర్గం కావడంతో...
కుప్పం మున్సిపాలిటీ చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉండటమే ఇందుకు కారణం. చంద్రబాబు ఈ ఎన్నికను తొలి నుంచి సీరియస్ గా తీసుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు నోటిఫికేషన్ కు ముందే పర్యటించి తనకు మద్దతివ్వాల్సిందిగా ప్రజలను కోరారు. క్యాడర్ లో ధైర్యాన్ని నింపారు. అభ్యర్థులకు అన్ని రకాలుగా ఉంటానని హామీ ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ సయితం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించి ప్రచారం చేసి వచ్చారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని....
ఇక వైసీపీ కూడా ఏమాత్రం తగ్గలేదు. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగురవేసి చంద్రబాబును దెబ్బకొట్టాలన్న ప్రయత్నంలో ఉంది. అక్కడ ఇన్ ఛార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డిలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుప్పంలో ఉన్నవి 25 వార్డులు. అందులో ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవం అయింది. 24 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 87 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ, చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
సానుభూతి కోసమేనా?
కానీ కేవలం కుప్పం మున్సిపాలిటీ గెలిచినా, ఓడినా రెండు పార్టీలకు ఒరిగేదేమీ ఉండదు. కానీ తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరహాలో రెండు పార్టీలు పంతానికి, పట్టుదలకు పోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ ఫలితంతో ముఖ్యమంత్రి జగన్ కు గాని, విపక్ష నేత చంద్రబాబుకు గాని జరిగే ప్రయోజనం లేదు. ఒనగూరే నష్టమూ లేదు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని చెప్పి సానుభూతి తెచ్చుకోవాలని చంద్రబాబు, కుప్పంలో గెలిచి బాబును దెబ్బతీయాలని జగన్ భావిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలకు పట్టుదలకు పోవడంతోనే కుప్పం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story