Sun Nov 24 2024 00:55:34 GMT+0000 (Coordinated Universal Time)
రమణా అదృష్టం అంటే నీదే... ఆరేళ్ల తర్వాత?
ఎల్. రమణ ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నారు.
ఎల్. రమణ ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత ఉత్కంఠ రేపినా చివరకు ఎల్ రమణ విజయం సాధించారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నారు. పార్టీ మారడమే ఆయనకు వరంగా మారింది. పార్టీ మారే ముందే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి పాలయినా కేసీఆర్ తనను నమ్మి వచ్చిన ఎల్. రమణను ఎమ్మెల్సీని చేశారు.
టీడీపీతోనే....
బీసీ నేతగా పేరున్న ఎల్. రమణ రాజకీయ జీవితం సుదీర్ఘకాలం టీడీపీలోనే కొనసాగింది. మూడు దశాబ్దాల పాటు ఆయన టీడీపీతో ప్రయాణించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేశారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి మొన్నటి వరకూ రమణ టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు జరగక ముందు చివరిగా 2009 లో ఆయన జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదీ టీడీపీ అభ్యర్థిగానే.
ఈటలపై వేటు...
2014, 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా గెలవలేదు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన 2014 తర్వాత ఎల్.రమణను చంద్రబాబు టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని చేశారు. పార్టీ మారేంత వరకూ ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ లో వేటుపడటం ఆయనకు కలసి వచ్చింది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇక తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని భావించిన ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరారు.
ఎట్టకేలకు పెద్దసభకు....
టీఆర్ఎస్ లో చేరిన ఎల్. రమణ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. కానీ టీఆర్ఎస్ అక్కడ గెలవలేదు. కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టిన కేసీఆర్ సామాజికవర్గ కోణంలో ఎల్.రమణకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో ఆయన గెలిచారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎల్. రమణ చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నారు. ఈటలపై వేటు పడటమే ఆయనకు కలసి వచ్చింది. సరైన సమయంలో పార్టీ మారడమే ఆయనకు లాభించింది. ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న నేతలు ఇప్పటికీ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. కానీ ఇలా జెండా మార్చగానే పదవి కొట్టేశావు చూడు. అదృష్టమంటే నీదేనోయి.
Next Story