Mon Dec 23 2024 07:46:39 GMT+0000 (Coordinated Universal Time)
లోపం ఎక్కడ? గాజు గ్లాసు నిండేదెన్నడు?
ఎన్నికలు దగ్గరపడుతున్నా జనసేనలో చేరికలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పవన్ వద్దనుకోవడం వల్లనే నేతలు చేరడం లేదంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఎన్నికల హీట్ మాత్రం రోజురోజుకూ పెరుగుతుంది. అన్ని పార్టీలూ ప్రజలను తమ వైపునకు తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అధికార వైసీపీ గృహసారధులను నియమించుకుంటోంది. ప్రతి యాభై ఇళ్లకు ఒక గృహసారధిని నియమించాలని జగన్ నిర్ణయించారు. ఇక టీడీపీ కూడా 30 ఇళ్లకో సాధికార సారధిని నియమించాలని నిర్ణయించింది. చంద్రబాబు జిల్లాల పర్యటన జోరుగా చేస్తుండగా, లోకేష్ పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికే ఇరవై రెండు రోజులు దాటుతుంది. జనసేనలో మాత్రం ఇంకా జోష్ కనిపించడం లేదు.
పట్టున్న జిల్లా నుంచి...
తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. అధికాక వైసీపీ వైపుకు వచ్చి కూడా నేతలు కండువాలు కప్పుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో టీడీపీయే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో నేరుగా టీడీపీలో చేరేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బీజేపీ నుంచి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ త్వరలో టీడీపీలో చేరతారని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి కూడా హామీ లభించినట్లు వినపడుతుంది. ఆయన నిజానికి జనసేనలోకి వెళ్లాల్సి ఉన్నా తన మనసును మార్చుకుని టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాజాగా చిన్నోడో.. పెద్దోడో మహాసేన రాజేశ్ కూడా టీడీపీలో చేరిపోయాడు తప్ప జనసేన వైపు చూడలేదు. అదీ జనసేనకు పట్టున్న తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజేశ్ టీడీపీలో చేరిపోయాడు. ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ వైపు చూశారు తప్పించి జనసేన వైపు చూడలేదు.
పొత్తు ప్రచారం ఉన్నా...
టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కూటమిగా వెళ్లే అవకాశాలు 100శాతం ఉన్నాయని నేతలు కూడా నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన వైపు చూడకుండా చంద్రబాబు చేత ఎందుకు కండువాలు కప్పించుకుంటున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పవన్ పై నమ్మకం లేదా? అంటే అది కాదు. పవన్ నిజాయితీ కలిగిన నేత. అంతే కాదు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అదే నేతలకు ఇబ్బందిగా మారుతుందంటున్నారు. నిలకడలేని రాజకీయ నేతలను ప్రజలు విశ్వసించరన్నది సీనియర్ రాజకీయ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే జనసేన కంటే పసుపు పార్టీ అయితేనే బెటర్ అని భావిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. నిజానికి జనసేనలో చేరి పొత్తులో భాగంగా టిక్కెట్ తెచ్చుకోవచ్చన్న భావన కూడా నేతలకు లేకుండా పోయింది.
నిధులు ఇవ్వరనేనా?
మరోవైపు టీడీపీ నుంచి టిక్కెట్ హామీ లభిస్తే ఆర్థికంగా కూడా ఆదుకుంటారు. పార్టీ నుంచి నిధులు భారీగానే అందుతాయి. కానీ జనసేన నుంచి మాత్రం నిధులను ఆశించడం అత్యాశ అవుతుంది. ఎన్నికల్లో కేవలం పవన్ చరిష్మాను మాత్రమే చూసి ఓటెయ్యాలని భావిస్తారు. కానీ ఎన్నికల్లో అది కుదరదు. అవతలి వారి కన్నా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వారికే విజయం వరిస్తుందని నేతలు నమ్ముతారు. పవన్ పార్టీ ఆర్థికంగా పెద్దగా ఆదుకోరని భావించిన నేతలు జనసేన వైపు చూడటం లేదంటున్నారు. అందుకే ఎన్నికలు సమీపించినా జనసేనలోకి చేరికలు లేవంటున్నారు. పవన్ కూడా చేరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్త వారిని చేర్చుకుని తలనొప్పులు తెచ్చుకోదలచుకోలేదంటారు. అందుకే గాజు గ్లాస్ నిండటం లేదంటున్నారు.
Next Story