Sun Dec 22 2024 19:09:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో లిక్కర్ స్వైర విహారం! ఖజానా గల గల |
తెలంగాణ లో ప్రభుత్వానికి వచ్చే అతి ముఖ్య ఆదాయాలలో జిఎస్టి,సేల్స్ టాక్స్ తరువాత మద్యంపై పన్ను ఆదాయమే అతి కీలకమైనది.2014 లో మద్యంపై పన్ను ఆదాయం సుమారు 2500 కోట్లు ఉంటే, 2022-2023 సంవత్సరానికి ఇది 20,000 కోట్లకు చేరింది.
తెలంగాణ లో ప్రభుత్వానికి వచ్చే అతి ముఖ్య ఆదాయాలలో జిఎస్టి,సేల్స్ టాక్స్ తరువాత మద్యంపై పన్ను ఆదాయమే అతి కీలకమైనది.2014 లో మద్యంపై పన్ను ఆదాయం సుమారు 2500 కోట్లు ఉంటే, 2022-2023 సంవత్సరానికి ఇది 20,000 కోట్లకు చేరింది.
రాష్ట్రంలో మొత్తం లిక్కర్ సేల్స్ విలువ 2014-2015 లో 10,880 కోట్లు మాత్రమే కాగా,2022 జనవరి 1 నుండీ డిసెంబర్ 30 మధ్య ఈ మద్యం అమ్మకాల విలువ 34 ,000 కోట్లకు చేరింది. గత 10 ఏళ్లలో లిక్కర్ వినియోగం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
2021-2023 మధ్య కాలంలో లిక్కర్ అమ్మకాల లైసెన్స్ పీరియడ్ లో తెలంగాణ మద్య నిషేధ, ఎక్సైజ్ శాఖకు వచ్చిన లైసెన్స్ ఫీజ్ ఆదాయం కేవలం 1370 కోట్లు మాత్రమే.కానీ 2023 డిసెంబర్ 1 నుండీ 2025 నవంబర్ 30 వరకూ రెండు సంవత్సరాల లిక్కర్ అమ్మకాల లైసెన్స్ పీరియడ్ లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పెట్టిన దరఖాస్తు ఫీజుల ద్వారానే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వానికి 2639 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
రాష్ట్రంలో ఉన్న 2620 లిక్కర్ షాపుల కోసం మొత్తం 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి మహిళలు,పిల్లల పేరుతో కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపుకు దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది.
మొత్తం దరఖాస్తు దారుల నుంచి లక్కీ డ్రాల ద్వారా షాపులను నిర్వహించే వారిని ఎంపిక చేశారు. ఈ సారి షాపులు దక్కించుకున్న వారిలో 40 శాతం మంది కొత్త వాళ్ళు కాగా, ఇందులో మహిళలు కూడా ఉన్నారు. “అన్నిట్లోనూ ముందున్న మహిళలు ఈ విషయం లో కూడా ముందుండాలి కదా అని” మీడియా ఇంటర్వ్యూ లో ఈ మహిళలు గర్వంగా ప్రకటించుకోవడం ఒక విషాదం.
5000 లోపు జనాభా ఉన్న ప్రాంతంలో షాపు కోసం రెండు సంవత్సరాలకు 50 లక్షల రూపాయలు,5 వేల నుంచి 50,000 జనాభా ఉన్న ప్రాంతాల షాపు కోసం 55 లక్షలు, 50 వేల నుండీ లక్ష వరకూ జనాభా ఉన్న ప్రాంతాల షాపుకు 60 లక్షల రూపాయలు, లక్ష నుండీ 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంత షాపుకు 65 లక్షలు , 5 లక్షల నుండీ 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంత షాపుకు 85 లక్షలు, 20 లక్షలు పైగా జనాభా ఉన్న ప్రాంత షాపుకు ఒక కోటీ 10 లక్షలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ ఫీజును 6 విడతలలో చెల్లించాలి.
ఇది మద్యంపై ప్రభుత్వానికి వచ్చే మరో నికర ఆదాయం.
జాతీయ కుటుంబ సర్వే రౌండ్ 5 ప్రకారం తెలంగాణ పురుషులలో 50 శాతం మంది మద్యానికి బానిసలయ్యారు.మహిళలలో కూడా 9 శాతం మంది మద్యం తీసుకుంటున్నారు.మహిళలపై హింసకు ,రోడ్డు ప్రమాదాలకు, అనేక నేరాలకు మద్యం ఒక కారణమనే విశ్లేషణలున్నవి. ప్రభుత్వానికి ఆదాయాన్ని, లిక్కర్ వ్యాపారులకు లాభాలను, ఎక్సైజ్ అధికారులకు లంచాలను, రాజకీయ పార్టీలకు చందాలను , డాక్టర్లకు ఫీజులను అందిస్తున్న మద్యం ,దానిని సేవిస్తున్న కుటుంబాలను మాత్రం అప్పుల ఊబిలో దించుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల పన్నులలో ఎక్సైజ్ పన్ను ఆదాయమే వృద్ధి రేటులో చాలా ముందుంది.రైతు బంధు పథకానికి 15,000 కోట్లు,ఆసరా పెన్షన్ లకు 10,000 కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ బంగారు బాతులా మారింది. విచ్చల విడిగా లిక్కర్ షాపులను పెంచుకుంటూ పోవడం,బార్లకు అనుమతులు ఇవ్వడం,బెల్టు షాపులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా, ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 14 లక్షల మంది మహిళలు వితంతువులుగా మారడంలో లిక్కర్ పోషించిన పాత్ర కూడా ఉన్నది.చిన్న పిల్లలు,యువత, వృద్ధులు అనే తారతమ్యం లేకుండా లిక్కర్ అందరినీ చుట్టుముడుతోంది.
Next Story