Sun Nov 24 2024 16:07:15 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులపై వ్యతిరేకత అంత ఉందా?
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. టిక్కెట్ తమకే వస్తుందన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలు ఎక్కువ మంది ఉన్నారు
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. టిక్కెట్ తమకే వస్తుందన్న ధీమాతో అధికార పార్టీ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. సిట్టింగ్లు అందరికీ సీట్లు అని కేసీఆర్ చెప్పడంతో వారు ముందు నుంచే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యక్తిగతంగా తమపై ఉన్న వ్యతిరేకతను మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా తమ పనితీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానిపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రయివేటు సంస్థలకు కాంట్రాక్టును అప్పగించారు.
సర్వేల ద్వారా...
ఇప్పటికే ఆ సంస్థలు ప్రజలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుంటుంది. మీ ప్రాంతంలో ఉన్న సమస్యలేంటి? ఎమ్మెల్యేపై మీకున్న అభిప్రాయం? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఏంటి? వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలు ఏవైనా ఉన్నాయా? అంటూ ఫోన్ల ద్వారానే ప్రజలను ఆరా తీస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ ను ఎమ్మెల్యేలకు అందిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు సమయం ఉండటంతో ఈలోపుగా వాటిని పరిష్కరించవచ్చని భావించి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది.
తొమ్మిదేళ్లు కావడంతో...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎటూ తాను సర్వేలు చేయిస్తారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సర్వేల బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు కావడంతో సహజంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా రెండు, మూడు సార్లు వరసగా గెలిచిన ఎమ్మెల్యేలపైనా వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంటుంది. ప్రజలకు మొహం మొత్తుతుంది. మార్పు కోరుకోవడం సహజమే. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ముఖ్యంగా మంత్రులు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. కొందరు మంత్రులు రెండు దఫాలుగా కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారు. మరికొందరు రెండోసారి మంత్రివర్గంలో చేరారు. అయితే ఎక్కువ మంది మంత్రులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
ఎక్కువ మంది ప్రజావ్యతిరేకత...
మంత్రుల్లో ఎక్కువ మంది ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని సర్వేల్లో స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరి మంత్రులు కావడంతో పాటు సమస్యలను పరిష్కరించలేకపోవడంతో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎక్కువ వ్యతిరేకత కనపడుతుంది. సర్వేల్లో కూడా అదే స్పష్టమవుతుండటంతో ఇప్పటి నుంచే గులాబీ పార్టీ నేతలు జాగ్రత్తలు పడుతున్నారు. తమకంటూ ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాలోనూ ప్రజలకు చేరువయ్యేందుకు సిద్దమవయ్యారు. ఏదో కార్యక్రమాన్ని పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరి సర్వేల ప్రకారం మంత్రులు, నగరంలో ఎమ్మెల్యేలు వీక్ గా ఉన్నారన్నది వారికే స్పష్టమయినట్లు తెలిసింది. మరి దీని నుంచి ఎలా బయటపడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story