Wed Dec 25 2024 02:06:00 GMT+0000 (Coordinated Universal Time)
షేక్ హ్యాండ్ "షేక్" అవుతుందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన కోసం ఆ పార్టీ నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు
అప్పుడే నెల గడిచింది. ఢిల్లీ నుంచి పిలుపు రాలేదా? మళ్లీ మొదటికొచ్చిందా? గత నెల ఆరోతేదీన చంద్రబాబు మోదీ తో భేటీ అయ్యారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశంలో చంద్రబాబుతో మోడీ కరచాలనం చేశారు. ఐదు నిమిషాలు మాట్లాడారు. ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు వచ్చినా పీఎంవోకు చెబితే చాలు అపాయింట్మెంట్ ఇస్తారని మోదీ అన్నట్లు వార్తలు వచ్చాయి. తాను కూడా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నట్లు చంద్రబాబు మోదీతో అన్నట్లు ప్రచారమూ సాగింది దీంతో చంద్రబాబు, మోదీ భేటీ త్వరలో జరగనుందని అందరూ భావించారు.
వరస పరిణామాలు...
దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలవడం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నారా లోకేష్ కూడా ఢిల్లీలో అమిత్ షాను కలిశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బీజేపీతో పొత్తు కుదిరినట్లేనని టీడీపీ అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఇంతవరకూ చంద్రబాబు హస్తిన పర్యటనకు బయలుదేరకపోవడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఏ మాత్రం అవకాశమున్నా...
నిజానికి చంద్రబాబుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా మోదీతో భేటీకి సిద్ధపడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పార్టీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కేసుల సమస్యను ఎదుర్కొంటోంది. దాని నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే నిజంగా మోదీ ఢిల్లీకి ఆహ్వానం పలికి ఉంటే పది రోజుల తర్వాతనైనా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లేవారు. బీజేపీ నేతలకు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా భావిస్తే అటు నుంచి అయినా ఆహ్వానం అందేది. కానీ అటు నుంచి పిలుపులు లేవు. ఇటు నుంచి ప్రయత్నాలు లేవు.
పొత్తు సంకేతాలపై....
తెలంగాణలో ఎన్నికల కోసం బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటుందన్న ప్రచారమూ జరిగింది. బీజేపీ తెలంగాణ నేతలు దీనిని కొట్టిపారేశారు. ఇటు చంద్రబాబు కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఆయన హస్తిన ప్రయాణం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా ఉంది. చంద్రబాబు కూడా పొత్తులు గురించి ఆలోచించకుండా ముందు పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించాలని పార్టీ నేతలకు పదే పదే పిలుపు నిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు హస్తిన ప్రయాణం ఇప్పట్లో జరుగుతుందా? లేదా? అన్న చర్చ పార్టీలో చర్చ జరుగుతోంది. అసలు బీజేపీతో పొత్తు కుదురుతుందా? మోదీ షేక్ హ్యాండ్ కు ఫలితం దక్కదా అన్న నిరాశ తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనపడుతుంది
Next Story