Mon Dec 23 2024 02:34:36 GMT+0000 (Coordinated Universal Time)
కాపు నేతల మీట్.. ఈసారి కీలకమేనట
కాపు సామాజికవర్గం నేతలు ఈ నెల రెండోవారంలో విజయవాడలో మరోసారి భేటీ కాబోతున్నారు
కాపు సామాజికవర్గం నేతలు ఈ నెల రెండోవారంలో విజయవాడలో మరోసారి భేటీ కాబోతున్నారు. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని వారు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే రెండు దఫాలు సమావేశమై కాపు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయ నేతలతో పాటు మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పటికే రెండు దఫాలు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉంది. అయితే వీరిలో ఐక్యత లేకపోవడంతో రాజ్యాధికారం లభించడం లేదు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలు సయితం కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తాము ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కాపు సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు.
అన్ని పార్టీల నేతలు...
ప్రధానంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటాశ్రీనివాసరావు తో పాటు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమావేశాలు జరిపారు. అన్ని పార్టీల్లో ఉన్న కాపు సామాజికవర్గం నేతల అభిప్రాయాలను తీసుకుని ప్రస్తుతం ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక వేదికను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
రాజ్యాధికారం దిశగా...
కాపులకు రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారం దిశగా ప్రణాళికలను రూపొందించాలని డిసైడ్ అయ్యారు. విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టాలని కూడా ఈ సమావేశం డిమాండ్ చేయనుంది. ఇందుకోసం విజయవాడలో ఈ నెల రెండో వారంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశం ఏపీ రాజకీయాలలో కీలకం కాబోతుంది. కలసి వచ్చే నేతలతో పాటు మేధావులతో కలుపుకుని ఒక వేదికను ఏర్పాటు చేయాలన్న కాపు నేతల ఆలోచన కార్యరూపం దాలుస్తుందో? లేదో? చూడాలి.
Next Story