Sat Dec 28 2024 07:04:14 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ కు ఇదే చివరి ప్రయత్నమా?
కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలంటే రాహుల్ గాంధీ వల్లనే అవుతుందన్నది నేతల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఆయన పోగొట్టుకూడదు.
రాహుల్ గాంధీ పై ఒక అపవాదు ఉంది. ప్రజల సమస్యలకు దూరంగా ఉంటారన్న అపప్రధను ఆయన ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండాల్సిన లీడర్ పార్టీ కార్యాలయం లేదా ఇంటికే పరిమితమవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికలను కూడా ఆయన సీరియస్ గా తీసుకోరన్నది సీనియర్లు చేసే విమర్శలు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగితే అక్కడ అప్పుడే కాస్త హడావిడి చేసి ఆ తర్వాత ఆ రాష్ట్రాని వదిలేయడం రాహుల్ గాంధీకి అలవాటన్నది అందరికీ తెలిసిన సత్యమే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆయన పెద్దగా పర్యటించరు.
ఫెయిల్యూర్ లీడర్ గా....
అందుకే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ లీడర్ గా ముద్రపడిపోయారన్నది సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్న మాట. మోదీ ప్రభుత్వం పై బాగా విరుచుకుపడుతున్నా, విమర్శలు చేస్తున్నా రాహుల్ గాంధీ పూర్తి కాలం పొలిటీషియన్ గా మారలేదన్నది పార్టీలోనే కొందరి నేతల అభిప్రాయం. పార్ట్ టైం లీడర్ గా ఆయన వ్యవహరిస్తుండటంతోనే ఎక్కువ రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినిందని అంటున్నారు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్నా అక్కడకు రాహుల్ తరచూ వెళ్లకపోవడం వల్లనే గ్రూపులు పెరిగిపోయి చివరకు పార్టీ అధికారం నుంచి వైదొలగాల్సి వచ్చిందంటారు.
అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ...
మధ్యప్రదేశ్ సంఘటన తర్వాత కూడా పవర్ లో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ పై ఏమాత్రం యువనేత దృష్టి పెట్టలేదు. ఇలా కేర్ లెస్ గా ఉండటం రాహుల్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీస్తుందన్న విమర్శలు కూడా లేకపోలేదు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా ఆయన నిర్ణయాలే చెల్లుబాటు అవుతున్నాయి. తనపై బరువు తగ్గించుకోవడానికే ఆ పదవి నుంచి ఆయన వైదొలిగారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో మమేకం కావడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. అయితే ఈ యాత్ర వల్లనైనా ఆయనలో మార్పు వస్తుందని సీనియర్లు ఆశిస్తున్నారు.
పూర్వ వైభవం కోసం....
కాంగ్రెస్ కు పూర్వ వైభవం రాష్ట్రాల్లో రావాలంటే రాహుల్ గాంధీ వల్లనే అవుతుందన్నది నేతల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఆయన పోగొట్టుకూడదు. ఇప్పుడు ప్రారంభమయిన ఈ యాత్ర ఐదు నెలల పాటు సాగుతుంది. మొత్తం రెండు వందలకు పైగా లోక్సభ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. కాంగ్రెస్ నేతలు ఆశించింది ఇదే. రాహుల్ నిత్యం ప్రజల్లో ఉంటేనే క్యాడర్ లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పార్టీ పునరుజ్జీవానికి దోహదపడుతుంది. దదాపు 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. దీని ద్వారా కూడా ఫలితం రాకుంటే ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. అందుకే దీనిని కాంగ్రెస్ పెద్దలు చివరి ప్రయత్నంగా భావిస్తున్నారు. మరి రాహుల్ పార్టీని ఏ విధంగా కాపాడతారన్నది ఆయన చేతుల్లోనే ఉందని చెప్పక తప్పదు.
Next Story