Mon Dec 23 2024 09:53:39 GMT+0000 (Coordinated Universal Time)
చేరికలు లేవు... ఉన్నవారు సయితం?
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలను పక్కన పెడితే ఉన్న నేతలు కూడా జారుకుంటుండటం ఇప్పుుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
తెలంగాణలో సాధారణ ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర మాత్రమే ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కూడా స్పీడ్ మీద ఉంది. కానీ కాంగ్రెస్ లో మాత్రం ఇంకా ఆ జోష్ కన్పించడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలు మరింత బలాన్ని ఇస్తాయి. కానీ కాంగ్రెస్ లో చేరికలను పక్కన పెడితే ఉన్న నేతలు కూడా జారుకుంటుండటం ఇప్పుుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
వరస ఓటములతో....
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ వరసగా 2014, 2018 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయింది. రెండుసార్లు పార్టీ నుంచి గెలిచిన నేతలు అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఆ పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ కు ఓటు వేస్తే వేస్ట్ అన్న అభిప్రాయం నెలకొంది. ఉప ఎన్నికల్లోనూ గెలుపు కాంగ్రెస్ కు సాధ్యం కాలేదు. గ్రేటర్ ఎన్నికల్లోనూ దారుణ ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీలో కొంత ఉత్సాహం కనపడుతుంది. పార్టీ కార్యక్రమాలతో కొంత ఊపు తెప్పించారు.
జగ్గారెడ్డి వంటి నేతలు...
అయితే జగ్గారెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ క్యాడర్ తిరిగి అయోమయంలో పడింది. జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సీనియర్ నేతలు కొంత సర్దిచెప్పడంతో పదిహేను రోజుల పాటు తన రాజీనామా నిర్ణయాన్ని జగ్గారెడ్డి వాయిదా వేసుకున్నారు. తనను సోనియా, రాహుల్ గాంధీ తో భేటీకి అవకాశం కల్పించాలని జగ్గారెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేతలు సమావేశమై జగ్గారెడ్డితో చర్చించారు.
రాజకీయంగా ఇబ్బందులే....
కానీ జగ్గారెడ్డి మెత్తబడేటట్లు కన్పించడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉంటే తాను కాంగ్రెస్ లో కొనసాగలేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఈరోజు ఆయన పార్టీ కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. అనంతరం మరో పదిరోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించినున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో చేరికలు లేకపోగా ఉన్న వారు వెళ్లిపోవడంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీకి ఇబ్బందిగా మారనుందని చెప్పక తప్పదు.
Next Story