Mon Dec 23 2024 02:43:37 GMT+0000 (Coordinated Universal Time)
" పుష్ప - ది రైజ్ " రివ్యూ : పుష్పరాజ్ తగ్గాడా ? నెగ్గాడా ?
సినిమా పేరు : పుష్ప: ది రైజ్
నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్, అజయ్, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాసన్, రుబెన్
సినిమాటోగ్రఫీ : మిరోస్లా కూబా బ్రొజెక్
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాత : నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
రచన, దర్శకత్వం: సుకుమార్
విడుదల : 17-12-2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప - ది రైజ్. ఆర్య, ఆర్య - 2 సినిమాలతో అల్లు అర్జున్ ను తెలుగు సినీ ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ గా పరిచయం చేసిన ఘనత సుకుమార్ కే దక్కుతుంది. ఆ రెండు సినిమాలు చేసిన 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో హాట్రిక్ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక అప్పట్నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఆఖరికి బన్నీ ఫ్యాన్స్ మోస్ ఎవైటెడ్ సినిమా రానే వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో 7 భారతీయ ప్రధాన భాషల్లో విడుదలైన పుష్ప సినిమాలో బన్నీ ఎలా నటించాడు ? సినిమా కథేంటి ? సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రలు పోషించారు? పుష్పరాజ్ తగ్గాడా ? నెగ్గాడా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే..
కథ :
పుష్ప అలియాస్ పుష్పరాజ్ ఓ కూలీ. చిన్నప్పటినుంచి ఎవరికీ భయపడని మనస్తత్వం. అయినవాళ్లే తనకు ద్రోహం చేయడంతో.. కసితో పెరుగుతాడు పుష్పరాజ్. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. పుష్ప కూలీ చేసే చోట కేశవ అనే స్నేహితుడు కలుస్తాడు. అతని స్నేహంతో పుష్పరాజ్ లైఫే టర్న్ అవుతుంది. కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లరైన పుష్ప.. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) అతని సోదరులకి స్మగ్లింగ్‌లో ఉపాయాలు చెప్పే స్థాయికి ఎదుగుతాడు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్ల సిండికేట్‌లో ఓ భాగస్వామిగా, తర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు పుష్పరాజ్. అప్పటివరకు ఆ స్థాయిలో ఉన్న మంగళం శ్రీను (సునీల్)కి పుష్పరాజ్ ఎదుగుదల కంటగింపుగా మారుతుంది. అపాయకరమైన మంగళం శ్రీను, కొండా రెడ్డి బ్రదర్స్‌తో శతృత్వం పెంచుకున్న పుష్పకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? శ్రీవల్లి (రష్మిక)ని ప్రేమించిన పుష్ప ఆమెని పెళ్లాడాడా లేదా ? కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో పుష్పకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది తెలియాలంటే 'పుష్ప: ది రైజ్' చూడాల్సిందే.
ఎలా ఉందంటే ?
ఇప్పటివరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వెండితెరపై వందల సినిమాలొచ్చాయి. హవాలా, డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా... ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ కూడా అలాంటి కథనే వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేవలం బన్నీ చేస్తున్న సినిమా కాబట్టే పుష్ప పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్ కొంతవరకు సఫలమయ్యాడు. ఎర్రచందనం ఎంత విలువైందో, అది మన శేషాచలం అడవుల నుంచి జపాన్ వరకు ఎలా ప్రయాణం చేస్తుందో చెబుతూ ఆరంభ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు సుకుమార్. ఆ ఎపిసోడ్ పక్కాగా ఆయన మార్క్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. ఆ తర్వాత పుష్ప ప్రయాణం మొదలవుతుంది. ప్రథమార్ధంలో హీరో నేపథ్యాన్ని, తన తండ్రి చనిపోయాక పరిస్థితులు మాత్రం కొంచెం భావోద్వేగాలు పంచుతాయి. ఆ తర్వాత ఎర్రచందనం రవాణా, సిండికేట్ తదితర వ్యవహారాలతో కథను ముందుకు నడిపిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్ లుక్‌తో తెరపై చూపించాడు.
ప్రతి సన్నివేశం....
ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. పుష్పరాజ్ కూలీ నుంచి సిండికేట్ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. విరామం అనంతరం ఎర్రచందనం సిండికేట్ లో అంతర్గత వ్యవహారాలనుంచి వచ్చే పోటీని పుష్ప ఎలా తట్టుకుంటాడన్న ఆసక్తితో ద్వితియార్థం మొదలవుతుంది.. కానీ ఇక్కడి నుంచి ప్రేక్షకుడికి నిరాశ ఎదురవుతుంది. కథ ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకుడికి విసుగు వస్తుంది. సీరియస్ మోడ్ లో కథ సాగుతుండగా.. వచ్చే శ్రీవల్లి ప్రేమాయణం, పాటలు చిన్న చిన్న బ్రేకులు వేసినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్- భన్వర్ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి చెందడు. పుష్ప పార్ట్ 2 వస్తే గానీ.. పుష్పరాజ్ కు ఒక ముగింపు ఉండదు. అప్పటి వరకూ ప్రేక్షకుడు ఎదురుచూడాల్సిందే. పార్ట్ 2 పుష్ప - ది రూల్ కోసం చాలా విషయాలను దర్శకుడు ముంగిచకుండా వదిలేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది.
ప్లస్ పాయింట్స్
+ అల్లు అర్జున్
+ ప్రథమార్ధం
+ నటీనటులు
+ దర్శకత్వం, సాంకేతిక బృందం పనితీరు
మైనస్ పాయింట్స్
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- నిడివి
రివ్యూ - "పుష్ప - ది రైజ్" నిడివి కాస్త తగ్గి ఉంటే.. పుష్పరాజ్ నెగ్గేవాడేమో ?
- Tags
- pushpa
- allu arjun
Next Story