Mon Dec 23 2024 10:45:48 GMT+0000 (Coordinated Universal Time)
మాచర్ల మంటలు ఎవరి పాపం?
మాచర్ల ఘటన రెండు పార్టీల మధ్య గొడవలు అనే కంటే రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు అని చెప్పాల్సి ఉంటుంది
మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఉంది. ప్యాక్షన్ గొడవలకు ఇది నిలయంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్, కుటుంబ రాజకీయాలే ఇక్కడ ఎక్కువ వర్క్ అవుట్ అవుతాయి. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించరు. ఏమాత్రం కవ్వించినా కొట్లాటకు సై అంటారు. కర్రలతోనే కాదు కత్తులతో దాడులకు దిగుతారు. వేట కొడవళ్లు. నాటుబాంబుల మోతతో మాచర్ల దద్దరిల్లిపోతుంది. హత్యలకు కూడా వెనకాడరు. ఆస్తుల ధ్వంసం చేసి తమ కసి తీర్చుకుంటారు. అలాంటి మాచర్ల ఎన్నికలు వస్తున్న వేళ మరింత మండుతూనే ఉంది. ఇరవై దశాబ్దాల తర్వాత మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి.అందుకే ఇక్కడ పోలీసులకు ఎప్పుడూ చేతినిండా పనే.
టీడీపీ తొలినాళ్లలో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో మాచర్ల నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 1989, 1994, 1999 ఎన్నికల్లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఇక్కడ టీడీపీ చేసిన తప్పేంటంటే గెలిచినా ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తుండటం టీడీపీకి అలవాటుగా మారింది. అదే ఒక రకంగా సైకిల్ పార్టీకి శాపమయిందని చప్పాలి. 1989లో నిమ్మగడ్గ శివరామకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా గెలవగా, 1994లో మాచర్ల టిక్కెట్ ను కుర్రి పున్నారెడ్డికి టీడీపీ ఇచ్చింది. ఆయన కూడా గెలిచారు. 1999 ఎన్నికల్లో మళ్లీ పున్నారెడ్డికి కాకుండా జూలకంటి దుర్గాంబకు టిక్కెట్ ఇచ్చారు. ఆమె కూడా విజయం సాధించింది. అప్పటి నుంచి అభ్యర్థిని మారిస్తే గెలుస్తామన్న సెంటిమెంట్ సైకిల్ పార్టీలో ఉంది.
రెండు కుటుంబాల మధ్య...
కానీ 2004 నుంచి సీన్ రివర్స్ అయింది. పిన్నెల్లి, జూలకంటి కుటుంబాల మధ్య పోరు మొదలయింది. జూలకంటి కుటుంబం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వస్తే, టీడీపీలో ఉన్న పిన్నెల్లి కుటుంబం కాంగ్రెస్ లోకి వచ్చింది. 2004 నుంచి 2019 వరకూ అక్కడ పిన్నెల్లి కుటుంబం నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా, ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఒకసారి కాంగ్రెస్, మూడు సార్లు వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి జూలకంటి కుటుంబం మాచర్ల రాజకీయాలకు దూరంగా ఉంది.
వ్యాపారాలకే పరిమితమైన...
2004, 2009లో రెండుసార్లు ఓటమి పాలయిన తర్వాత జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యాపారాలకే పరిమితమయ్యారు. మిగిలిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యరథులను మార్చినా టీడీపీ విజయం సాధించలేదు. అయితే ఇటీవల మళ్లీ పిన్నెల్లి కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు జూలకంటి కుటుంబం మాచర్ల రాజకీయాల్లోకి వచ్చింది. జూలకంటి బ్రహ్మారెెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి చంద్రబాబు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచే ఫ్యాక్షన్ గొడవలు ప్రారంభమయ్యాయి.
రెండు కుటుంబాల మధ్య...
ఇది రెండు పార్టీల మధ్య గొడవలు అనే కంటే రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు అని చెప్పాల్సి ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన ఘర్షణలు కూడా ఫ్యాక్షన్ గొడవలే. గ్రూపుల గొడవలను పార్టీ జెండాకు చుట్టడం ఇక పరిపాటి. అందుకే పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మాచర్లలో ఏదో ఒక చోట ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు గెలిచినా గొడవలు తప్పవు. ఘర్షణలు అనివార్యం. కొట్లాటలు యధాతధం. అదీ మాచర్ల నియోజకవర్గం.
Next Story