Sun Dec 22 2024 23:20:38 GMT+0000 (Coordinated Universal Time)
పూర్ ఫెలో... మాగుంట.. అనుకున్నదొక్కటీ?
మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించడానికి సర్వం సిద్ధం చేశారు
మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మంచి పేరుంది. మాగుంట సుబ్బరామిరెడ్డి హయాం నుంచి ఆ కుటుంబానికి అక్కడ తిరుగులేదు. కాంగ్రెస్ తో ప్రారంభమైన వారి ప్రయాణం మాగుంట సుబ్బరామిరెడ్డి మరణించిన తర్వాత కొంతకాలం శ్రీనివాసరెడ్డి టీడీపీ గూటికి చేరారు. ఆ తర్వాత తిరిగి వైసీపీలో చేరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాగుంట కుటుంబ 1990 దశకం నుంచి ఒంగోలు పార్లమెంటుకు ఎన్నికవుతూనే వస్తుంది. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి తొలిసారి గెలిచారు. ఆ తర్వాత ఆ కుటుంబం 1999, 2014లో మినహా అన్ని సార్లు ఎంపికవుతూనే వస్తుంది.
ఒంగోలు నియోజవకర్గంలో...
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మాగుంట కుటుంబం అందిస్తున్న సేవలు వారిని విజయం వైపు నడిపిస్తున్నాయి. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, విద్యాసంస్థలు నెలకొల్పి సేవలందించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం ఉండటం కూడా వారికి కలసి వచ్చిందనే చెప్పాలి. పేద, మధ్య తరగతి ప్రజలు మాగుంట కుటుంబం అంటే ప్రత్యేక గౌరవం ఉంది. వారి సేవలతోనే తమ ప్రాంతంలో కష్టాలు తొలిగిపోతాయని కనిగిరి తదితర ప్రాంత ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. మాగుంట సుబ్బరామిరెడ్డి మావోల చేతిలో హత్యకు గురైన తర్వాత ఆయన భార్య మాగుంట పార్వతమ్మ, ఆ తర్వాత సోదరుడు శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.
నెల్లూరు జిల్లా అయినా..?
నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో తమ సొంత ప్రదేశంగా మార్చుకోగలిగింది. బయట జిల్లావాసులుగా వారిని ఎప్పుడూ చూడలేదు. మాగుంట కుటుంబం తొలి నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తుందన్నది అందరికీ తెలిసిందే. విజయ్ మాల్యాతో వ్యాపార సంబంధాలున్నాయి. చెన్నైలోనూ ఆ కుటుంబానికి వ్యాపారాలున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి జయలలితతో ఆ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అలాంటి మాగుంట కుటుంబం నుంచి ఇప్పుడు మరో యువనేత 2024 ఎన్నికలకు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధం చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు బరిలో పోటీ చేయించడానికి సర్వం సిద్ధం చేశారు.
కుమారుడిని ...
ఈ మేరకు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటన కూడా చేశారు. అయితే అనుకోని పరిస్థితుల్లో మాగుంట రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పది రోజుల ఈడీ కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో మాగుంట రాఘవ పొలిటికల్ ఎంట్రీపై నీలినీడలు అలుముకున్నాయి. యువకుడైన రాఘవ ఈ స్కామ్ లో ఇరుక్కోవడంతో ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వడమూ కష్టంగానే మారిందంటున్నారు. తిరిగి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొనకుంటే రాఘవరెడ్డికి అవకాశం దక్కేది. అయితే ఈ ఆరోపణలతో 2024లో రాఘవకు రాజకీయంగా ఛాన్స్ లేనట్లేనన్న టాక్ బలంగా వినపడుతుంది.
Next Story