Mon Dec 23 2024 18:26:45 GMT+0000 (Coordinated Universal Time)
మారడం ఖాయం.. ఎప్పుడనేదే?
జనసేన, టీడీపీ పొత్తు కుదరడం ఖాయమని తెలిశాక మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ లో చేరడం ఖాయమని దాదాపుగా తెలిసిపోయింది
ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తుందన్న ప్రచారం టీడీపీలో మంచి జోష్ ను తెచ్చిపెడుతుంది. ఇది వాస్తవం. అనేకమంది వైసీపీలో ఇబ్బంది పడుతున్న నేతలు సయితం ఈ కాంబినేషన్ అధికారంలోకి రావడం ఖాయమని భావించి అధికార పార్టీ నుంచి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒకరు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా ఆయన మనసంతా టీడీపీపైనే ఉంది.
జనసేనతో పొత్తు....
ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తు కుదరడం ఖాయమని తెలిశాక మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ లో చేరడం ఖాయమని దాదాపుగా తెలిసిపోయింది. ప్రకాశం జిల్లాలో ఇదే ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోనే చేరారు. ఎంపీగా అప్పుడు గెలవలేక పోవడంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
గత ఎన్నికలకు ముందు....
అయితే 2019 ఎన్నికలకు ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని కాదని జగన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. అయితే మాగుంట వైసీపీలో కంఫర్ట్ గా లేరన్నది వాస్తవం. రాజకీయంగా, వ్యాపారపరంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయామని మాగుంట గట్టిగా భావిస్తున్నారు. తన కుమారుడి భవిష్యత్ ను కూడా ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మొన్న పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీలో మంచి వ్యక్తి మాగుంటగా అభివర్ణించారు.
మంత్రికి, మాగుంటకు....
వైసీపీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పట్టించుకునేవారే లేరు. మంత్రి బాలినేనికి, మాగుంట కు భారీ గ్యాప్ ఉంది. వైసీపీలో కొనసాగితే తన కుమారుడు రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్ కు భరోసా లేదని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగాను, ఆయన కుమారుడు రాఘవరెడ్డి మార్కాపురం ఎమ్మెల్యేగానూ టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. తన నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు కూడా తానే భరిస్తానని కూడా మాగుంట టీడీపీ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారడం ఖాయమన్నది ప్రకాశం జిల్లాలో విన్పిస్తున్న టాక్...
Next Story