మమతకు మరోషాక్
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ లో తలపెట్టిన రధయాత్రకు కోల్ కత్తా హైకోర్టు ఓకే చెప్పేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో రాజకీయ మార్పు కావాలంటూ ఈ రధయాత్ర చేపట్టారు. దాదాపు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రధయాత్ర సాగనుంది. కానీ ఈ రధయాత్రకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అనుమతి నిరాకరించింది.
హైకోర్టును ఆశ్రయించడంతో....
దీంతో బీజేపీ నేతలు కోల్ కత్తా హైకోర్టును ఆశ్రయించారు. అయితే రధయాత్రలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే దానికి బీజేపీ నేతలు బాధ్యత వహించాలని హైకోర్టు చెప్పింది. ముందుగానే రధయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను పోలీసులకు అందజేయాలని హైకోర్టు ఆదేశించంది. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే రధయాత్ర జరగాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో అది నిలిచిపోయింది. కోర్టు ఉత్తర్వులతో అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో త్వరలోనే రధయాత్ర చేపట్టనున్నారు.