Mon Dec 23 2024 14:51:07 GMT+0000 (Coordinated Universal Time)
సుమలతకు ఛాన్స్ దొరుకుతుందా?
కర్ణాటక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుమలత తన మద్దతును బీజేపీకే అన్నారు
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాండ్యా ఎంపీ సుమలత తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతు బీజేపీ అభ్యర్థులకే ఉంటుందని తెలిపారు. మాండ్యా నియోజకవర్గం తొలి నుంచి జనతాదళ్ ఎస్ కు మద్దతుగా నిలిచింది. అంబరీష్ మరణం తర్వాత సుమలత గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్యా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను విజయం సాధించింది.
ఇండిపెండెంట్గా...
అయినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం మాండ్య నుంచి ఇండిపెండెంట్గా సుమలత విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ నాటి ఎన్నికల్లో ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పై పోటీ చేసి 1.25 లక్షల మెజారిటీతో విక్టరీ కొట్టారు. దీంతో జాతీయ స్థాయిలో సుమలత పేరు మారుమోగింది. అక్కడ గెలిచి అంబరీష్ కు ఉన్న పట్టును సుమలత నిరూపించగలిగారు. అయితే సుమలత కాంగ్రెస్ లో వెళతారని అందరూ భావించారు. కాంగ్రెస్ కూడా ఆమెను సంప్రదించలేదు. అక్కడ జేడీఎస్ బలం ఎక్కువగా ఉండటంతో బీజేపీ పావులు కదిపింది. వెంటనే ఆమెతో సంప్రదింపులు జరిపింది. జేపీ నడ్డాతోనూ సుమలత సమావేశమయ్యారు.
జేడీఎస్ కంచుకోటలో...
సుమలత చేరికతో పార్టీ బలం మాండ్యా ప్రాంతంలో మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ బలంగా ఉన్న మాండ్య ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకునే దిశగా కమలనాధులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. సుమలత కూడా కాంగ్రెస్ వైపు వెళ్లలేక, ఈసారి స్వతంత్రంగా పోటీ చేయలేక బీజేపీ వైపు మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికలలో తన సంపూర్ణ మద్దతు బీజేపీకే ఉంటుందని ఆమె ప్రకటించారు. దీనివల్ల మాండ్య లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సుమలత ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. తన నిర్ణయం వల్ల ఎలాంటి పరిణామాలైనా ఎదురుకావచ్చని, కానీ అన్నింటినీ తట్టుకోవడానికే సిద్ధపడ్డానని సుమలత తెలిపారు.
రేపు ప్రధాని పర్యటన ...
ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మాండ్యా ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా సుమలత కూడా ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రిస్క్ అని తెలిసినా తాను బీజేపీలో నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరుతున్నానని సుమలత ప్రకటించడం ఎన్నికల వేళ కమలం పార్టీకి కొంత ఊరట కలిగించే పరిణామంగానే చెప్పుకోవాలి. ఇటు తమ ప్రధాన ప్రత్యర్థులైన జేడీఎస్, కాంగ్రెస్ లను దెబ్బతీయడానికి ఈ ప్రాంతంలో సుమలత చేరిక ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి సుమలత చేరికతో మాండ్యాలో కమలం పార్టీ ఎలాంటి ఫలితాలను సాధిస్తుందన్నది భవిష్యత్ లో జరగబోయే ఎన్నికల్లో తేలాల్సి ఉంది.
Next Story