Thu Jan 16 2025 19:59:01 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఒక్క సభతో బుగ్గ కారు వచ్చినట్లేనట
ఏపీలో బీజేపీ బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సరైన నేతలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారనుంది.
ఒక సభ పెట్టారు. సక్సెస్ అని సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీని ఓడించినట్లేనని భ్రమల్లో ఉన్నారు. ఇంతకీ బీజేపీ నేతలు ఏం సాధించినట్లు? విజయవాడలో సభ నిజంగా సక్సెస్ అయిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను సమీకరించి సభ విజయవంతం అయిందని చెప్పుకోవడం సబబేనా? ఈ సభకు ప్రజామోదం ఉందా? ఈ నాయకులను ప్రజలు అసలు పట్టించుకుంటున్నారా? అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
వాగ్దాటి ఒక్కటే....
బీజేపీ నేతలకు మంచి వాగ్దాటి ఉంటుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి సోము వీర్రాజు వరకూ మాటల తోనే ఎదిగారు. ప్రజాబలం పెద్దగా లేకపోయినా వారి వాగ్దాటి వారికి పదవులను తెచ్చిపెట్టింది. కేవలం మాటలు ఉంటే చాలా? ప్రజామోదం అవసరం లేదా? అంటే బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు. ఏపీ బీజేపీ ఈ ముప్ఫయి నెలల కాలంలో ఒక పెద్ద కార్యక్రమం చేపట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి.
కార్యక్రమాలేవీ...?
రామతీర్థం, అంతర్వేదీ ఘటనల సమయంలో కొంత హడావిడి చేసిన బీజేపీ నేతలు తర్వాత కార్యాలయానికే పరిమితమయ్యారు. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత భారీ కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి లేదు. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకూ పాదయాత్ర అని ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గారు. అలాగే అమరావతి రైతుల కోసం పాదయాత్ర అని చెప్పి దానిని కూడా వాయిదా వేశారు.
ఒక సభతో....
ఇక కేంద్ర నాయకత్వం వత్తిడి మేరకు ఒక సభ పెట్టి వైసీపీని, టీడీపీని తిడితే ప్రజామోదం లభిస్తుందా? ప్రజలు గంపగుత్తగా వీరికి ఓట్లు వేస్తారా? వీరి డైలాగులు విని పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసి కమలం గుర్తుపై బటన్ నొక్కుతారా? కానీ బీజేపీ నేతలు మాత్రం అదే భ్రమల్లో ఉన్నారు. ఈ సభతో వైసీపీ పని అయిపోయిందట. టీడీపీ ఇక దుకాణం బంద్ చేయాల్సిందేనట. తాము మాత్రం బుగ్గ కారు కోసం ఇంట్లో కూర్చుని వెయిట్ చేస్తారట. ఇదీ ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. పొరుగు జిల్లాల్లో అక్కడి బీజేపీ నేతలు ఎలాంటి ఆందోళనలు చేస్తున్నారో తెలుసుకుని కాస్త నేలమీదకు దిగితే బాగుంటుంది.
Next Story