Mon Dec 23 2024 06:27:05 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకంత కోపం... ఆయన ఆలోచన అదేనా?
మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. నిజానికి ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇక బాగుపడేటట్లు కన్పించడం లేదు. ఏ ఎన్నిక వచ్చినా ఐక్యంగా కలసి పనిచేయాలన్న స్పృహ నేతల్లో కన్పించడం లేదు. తమంతట తామే పోలింగ్ కు ముందుగానే పార్టీని వెనక్కు లాగేయడం పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయింది. ఎవరిపై ఎవరీకీ నమ్మకం లేకపోవడం, అసూయ, ధ్వేషం వంటి అంశాలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు దాటుతున్నా పార్టీని పటిష్టపర్చుకుందామనుకున్న ధ్యాస ఏ ఒక్క నేతలోనూ కన్పించడం లేదు. పార్టీ కోసం పనిచేయకపోగా వీలు చిక్కినప్పుడు నాలుగు రాళ్లు వేయడం అలవాటుగా మారింది.
ఠాగూర్ టార్గెట్ గా....
తాజాగా తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటే గిట్టని నేతలందరూ ఠాగూర్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. తప్పు ఎవరిదో తెలియదు. నిజంగా మాణికం ఠాగూర్ వన్‌సైడ్ వెళుతున్నారా? అన్న అనుమానం కలుగుతుంది. సీనియర్ నేతల అవసరం లేదనుకున్నారో? లేక వారికి ప్రజల్లో పెద్దగా మద్దతు లేదని భావిస్తున్నారో తెలియదు కాని సీనియర్ నేతలను మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్ విస్మరిస్తుందని అనుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగానే విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
మర్రి చేసిన వ్యాఖ్యలు...
తాజాగా మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. నిజానికి మర్రి శశిధర్‌రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు. సాఫ్ట్ నేచర్. ఆయన ఎవరితోనూ పెద్దగా కలవరు. పార్టీ తనకు అప్పచెప్పిన పనులను చేసుకుంటూ పోవడమే ఆయన లక్ష్యం. అలాంగి మర్రి శశిధర్‌రెడ్డి ఆగ్రహం తొలిసారి చూడాల్సి వచ్చింది. ఆయనకు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడుగానే కాకుండా స్వయంగా కూడా కొంత విలువలను పాటించే నేత. పార్టీని నమ్ముకున్న నేత. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ లైన్ ను జవదాటని లీడర్. అలాంటి లీడర్ కు కోపం రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రక్షించే వారెవ్వరు?
ప్రధానంగా గాంధీభవన్ కు సమాంతరంగా ఒక కార్యాలయం నడుస్తుందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. మాణికం ఠాగూర్ రేవంత్ ఏజెంట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి జగ్గారెడ్డి, హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతలు పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. వీరంతా పార్టీకి అనేకంటే రేవంత్, మాణికం ఠాగూర్ లకు శత్రువులుగా మారారు. వారు ఏ పని చేసినా కలసివచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు బీజేపీలోకి వెళ్లాలనుకునే వారికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాణికం ఠాగూర్ మర్రి శశిధర్ రెడ్డి పట్ల పరోక్షంగా వ్యాఖ్యానిండం కూడా కొంత కలకలం రేపింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న తీరులో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తనంతట తానే కనుమరుగయి పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎవరూ రక్షించలేరన్నది మరోసారి అర్థమయింది.
Next Story