మావోయిస్టుల లొంగుబాటు వెనక టీఆర్ఎస్ నేత...?
మావోయిస్టు దంపతులు పురుషోత్తం..వినోదిని పోలీసుల ఎదుట లొంగిపోయారు. 40ఏళ్లపాటు మావోయిస్టు పార్టీకి సేవలందించి. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన వీరు అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ సమక్షంలో లొంగి పోయారు. జనజీవనస్రవంతిలో కలిసిపోయారు. ఎనిమిది లక్షల రివార్డు ఉన్న వీరి లొంగుబాటుకి తెరవెనుక ఓ టిఆర్ఎస్ నేత పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన పురుషోత్తం అలియాస్ రవి, అతడి భార్య వినోదిని అలియాస్ భారతక్క ఇద్దరు హైదరాబాద్ అడ్డగుట్టకు చెందినవారు. పురుషోత్తానిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. పురుషోత్తం అంబేద్కర్ విద్యానికేతన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశాడు. అదే సమయంలో 1982లో అదే ప్రాంతంలో టీచర్ గా పని చేస్తున్నవినోదినిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వీరిని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసింది. 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన వీరిద్దరు టాప్ పొజిషన్ లో ఉన్నారు. పురుషోత్తంపై ఎనిమిది లక్షల రివార్డు ఉన్నట్లు సిపి అంజనీ కుమార్ వెల్లడించారు.
అగ్రనేతల వద్ద.....
1981పార్టీలో చేరిన ఈ దంపతులు ఇద్దరు 1986 వరకు సిటీ కమీటీ మెంబర్ అండ్ సెక్రటరీలుగా పని చేశారు. 2005 నుండి 2014 వరకు అక్కిరాజు హరగోపాల్ కు అలియాస్ రామకృష్ణకు గైడెన్స్ గా పని చేశారు. తదనంతరం సిపిఐ మావోయిస్టు ప్రింటింగ్, పబ్లిషింగ్ లో పని చేస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్య కారణాలు వారిని వెంటాడాయి. అంతే కాకుండా పార్టీలో తీసుకునే నిర్ణయాలు సిద్ధాంతాలు వారిని వెనుక్కి అడుగు వేసేలా చేశాయి. దీంతో జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు సికింద్రాబాద్ లో పేరుమోసిన టిఆర్ఎస్ నాయకుడు సహకారంతో హైదరాబాద్ సిపి అంజనీకుమార్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో స్వార్థం పెరిగిపోయిందని పోలీసుల ఎదుట లొంగిపోయిన పురుషోత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను 1969, 1972లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నానని, రామకృష్ణ, గణపతితో 25ఏళ్లుగా కలిసే తిరిగినట్లు పురుషోత్తమ్ తెలిపారు. మావోయిస్టు అగ్రనాయకత్వంలో 20ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేదని.. ఇప్పుడు వారిలో స్వార్థం పెరిగిపోయిందన్నారు. పదేళ్లుగా తమను నిర్లక్ష్యం చేశారని.. అగ్ర నాయకత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. తమను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. వినోదిని ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టించుకోలేదని.. కనీసం ఆమె చేతివంట తిన్న విశ్వాసం కూడా వారికి లేదన్నారు.
కిడారిని చంపడం సరికాదు.....
ఆంధ్రప్రదేశ్లోని అరకులో ఇద్దరు ప్రతినిధులను హత్య చేయడం సరికాదని పురుషోత్తం, వినోదిని అభిప్రాయపడ్డారు. ఓ వైపు మావోయిస్టు అగ్ర నాయకత్వం నిర్లక్ష్యం చేయడం.. మరోవైపు ఆరోగ్యం సహకరించకే లొంగిపోయినట్లు స్పష్టం చేశారు. మొత్తానికి మావోయిస్టు పార్టీలో అదినాయకత్వ పోరు ఏ రేంజ్ లో ఉందో, కింద క్యాడర్ ని ఎలా చూస్తారో పురుషోత్తం దంపతులు చెప్పిన వివరాలతో వెల్లడౌతోంది. మరి వీరి లొంగుబాటు, ఆరోపణలను మావోయిస్టు పార్టీ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.