Mon Dec 23 2024 12:23:18 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ రాకపై..?
ఈ నెల 20 ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ ఒక కార్యక్రమం నిర్వహించనుంది. జూనియర్ ఎన్టీఆర్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు
ఈ నెల 28వ తేదీన రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కూడా జరగనున్నాయి. హైదరాబాద్లో ఈ నెల 20 ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ ఒక కార్యక్రమం నిర్వహించనుంది. జూనియర్ ఎన్టీఆర్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అందరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. అలాగే బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురంద్రీశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులును కూడా కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
రజనీ దెబ్బకు...
అయితే ఇటీవల విజయవాడలో జరిగిన కార్కక్రమానికి రజనీకాంత్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో కార్యక్రమానికి హైప్ వచ్చింది. అయితే అదే సమయంలో అది రాజకీయంగా కూడా వివాదంగా మారింది. రజనీకాంత్ మామూలుగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనను ఇబ్బంది పెట్టాయి. ఎన్టీఆర్ పేరుతో పిలిచినా రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చూస్తారని, రజనీకాంత్ విషయంలో ఇదే స్పష్టమైందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అందుకే ఆ ప్రోగ్రాంకు జూనియర్ దూరంగా ఉండాలని కోరుతున్నారు.
కొన్నేళ్లుగా...
గత కొన్నేళ్లుగా జూనియర్ ను నారా కుటుంబం దూరంగా ఉంచింది. హరికృష్ణ బతికి ఉన్నప్పుడే ఆయనను పక్కన పెట్టేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు హరికృష్ణ మృతి చెందిన తర్వాత కూడా దానిని రాజకీయంగా వాడుకోవడానికి చూశారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్త పడాలని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇప్పటికీ చంద్రబాబు, లోకేష్ పర్యటించే చోట జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కుప్పం నుంచి ఏ నియోజవర్గంలోనైనా ఆయన ఫ్యాన్స్ మాత్రం టీడీపీని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తుంది.త
అవకాశమే లేదు...
కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే నారా లోకేష్ ఇప్పటికే పార్టీని చాలా వరకూ తన సొంతం చేసుకున్నారు. ఆయనే తమ భవిష్యత్ నాయకుడన్నది నేతలు నమ్ముతున్నారు. లోకేష్ ఆశీస్సులు లేకపోతే టిక్కెట్ కూడా దక్కదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో పెద్ద పీట వేసే ప్రసక్తి ఉండదు. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసు. ఆయనకు సినిమాల పరంగా ఎంతో ఫ్యూచర్ ఉంది. అది వదులుకుని రాజకీయాలకు రావడం కూడా అంత మంచిది కాదనే వారు కూడా ఉన్నారు. అలాగని తన తాతకు చెందిన సభ అయినా వెళితే దానిని రాజకీయంగా వాడుకునే అవకాశముంటుందన్న ఆందోళన జూనియర్ ఫ్యాన్స్లో ఉంది. పైగా ఈ నెల 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆరోజు ఆయన ముందుగానే మాల్దీవుల ట్రిప్ వెళ్లాడని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. బహుశ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలుకు ఆయన హాజరు కాకపోవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story