Fri Dec 20 2024 17:49:09 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నాని ఊరికే అనరు.. అంతా సిద్ధమయిందట
మంత్రి కొడాలి నాని ఊరికే వ్యాఖ్యలు చేయరు. ఆయన వద్ద పక్కా సమాచారం ఉంటేనే ఏదైనా మాట్లాడతారు
మంత్రి కొడాలి నాని ఊరికే వ్యాఖ్యలు చేయరు. ఆయన వద్ద పక్కా సమాచారం ఉంటేనే ఏదైనా మాట్లాడతారు. ప్రత్యర్థుల పై విమర్శలు చేసే విషయంలో పక్కా ఆధారాలు లేకపోయినా చేస్తారు. కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం ఆయన పక్కాగా ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ కోటరీలో ముఖ్యుడిగా ఉంటున్న కొడాలి నాని కామెంట్స్ కు అందుకే అంత బలముంటుంది. మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయి.
వెనక్కు తీసుకుంటున్నామని....
మూడు రాజధానుల బిల్లులను మళ్లీ తెస్తామని కొడాలి నాని చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆరోజే ముఖ్యమంత్రి జగన్ ఈ బిల్లులను కొద్దిగా మార్పులు, చేర్పులతో తెస్తామని సభలోనే చెప్పారు. హైకోర్టులో ఈ అంశంపై జరుగుతున్న విచారణలో కూడా తాము మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్లు అఫడవిట్ దాఖలు చేశారు కూడా.
బడ్జెట్ సమావేశాల్లోనే....
అయితే రానున్న బడ్జెట్ సమావేశాల్లోనూ మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం తీసుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మార్చి మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను తీసుకురానున్నారని సమాచారం. ఇటు శాసనసభ, అటు శాసనమండలిలో సంపూర్ణ బలం ఉండటంతో ఈసారి ఈ బిల్లులు సులువుగా ఆమోదం పొందే అవకాశాలున్నాయి.
ఉగాదికే సీఎం కూడా...
దీనిపై ఈసారి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఇటు న్యాయనిపుణులతో పాటు ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా దీనిని రోజు వారీగా సమీక్ష కూడా చేస్తున్నారు. బిల్లులు తయారీ తుది దశకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రి కొడాలి నాని మరోసారి మూడు రాజధానుల బిల్లుల వ్యవహారాన్ని ప్రస్తావించారంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే సమయంలోనే అంటే ఉగాది నాటికి విశాఖకు తరలి వెళ్లాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని కూడా చెబుతున్నారు.
Next Story