Mon Nov 18 2024 04:34:55 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి వైసీపీలో ఒంటరి అయ్యారా?
మంత్రి కొడాలి నాని వైసీపీలో ఒంటరి అయ్యారనిపిస్తుంది. ఆయనకు మద్దతుగా మంత్రులు ఎవరూ నిలబడటం లేదు
కొడాలి నాని ఒంటరి అయ్యారా? వైసీపీ నుంచి ఆయనకు పెద్దగా మద్దతు లభించడం లేదా? మంత్రిగా ఆయన చూపిస్తున్న దూకుడుకు మిగిలిన నేతల్లో అసూయ బయలుదేరిందా? అంటే అవుననే అనిపిస్తుంది. కొడాలి నానికి ఎవరి మద్దతు అవసరం లేదు. తనకు తానుగానే తన వాదన వినిపించుకోగలిగిన శక్తి, సామర్థ్యం ఉంది. సాధారణంగా ఒక పార్టీలో నేతను విపక్షం టార్గెట్ చేస్తూ ఉంటే మిగిలిన మంత్రులు ఆయనకు మద్దతు పలుకుతుంటారు.
ఆరోపణలు వస్తే....
గతంలో మంత్రుల మీద ఆరోపణలు వచ్చినా ఇదే జరిగింది. గుమ్మనూరి జయరాంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మిగిలిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు దానిని ఖండించారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సమాధానమిచ్చారు. కానీ కొడాలి నాని విషయంలో మాత్రం అలా జరగడం లేదు. కొడాలి నాని ప్రస్తుతం క్యాసినో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్యాసినో ను కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారా? లేదా? అన్నది పక్కన పెడితే అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
జరగలేదని చెబుతున్నా....
తన కన్వెన్షన్ సెంటర్ లో ఎలాంటి క్యాసినోను నిర్వహించలేదని కొడాలి నాని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఛాలెంజ్ విసిరే పరిస్థితికి వచ్చారు. అయినా ఏ మంత్రి కూడా కొడాలి నానికి మద్దతుగా నిలవలేదు. ఒక్క దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రం కొంత మద్దతు పలికారు తప్పించి మిగిలిన మంత్రులు ఎవరూ ఈ విషయంపై నోరు మెదపలేదు.
మంత్రులు అందుకేనా?
అంటే వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు మంత్రుల వ్యవహరించే తీరు అనుమానం కల్గించే విధంగా ఉంది. కొడాలి నాని క్యాసినో నిర్వహించి ఉంటారని, జగన్ దీనిని సీరియస్ గా తీసుకున్నారని భావించే మంత్రులు ఈ విషయంపై పెదవి విప్పడం లేదన్న అనుమానాలు క్యాడర్ లో ఉంది. నానికి బాగా జరిగిందని సంతోషపడి ఉండవచ్చు. సరే నిజంగా తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు. దానిని ఎవరూ కాదనరు. ఒక జింక మీదకు సింహం వస్తే అన్ని జింకలు కలసి దానిని వెంటాడతాయి. కనీసం జంతువులకు ఉన్న ఐక్యత కూడా మంత్రులలో లేదని, కొడాలి నాని ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుందన్న కామెంట్స్ వైసీపీ అభిమానుల నుంచే విన్పిస్తున్నాయి.
- Tags
- kodali nani
- ysrcp
Next Story