జగన్ పై దాడిని ఖండిస్తే రాజకీయమా..?
నాలుగేళ్లుగా ఎటువంటి బేధాలు లేకుండా సీమాంధ్రులు తెలంగాణలో సంతోషంగా ఉన్నారని... కానీ ఇప్పుడు కొన్ని పార్టీలు తమ రాజకీయాల కోసం ప్రాంతాలను తీసుకువస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం కూకట్ పల్లిలో ‘కేసీఆర్ కి సీమాంధ్రుల సంఘీభావం’ పేరుతో సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... ఒక్క హైటెక్ సిటీ మాత్రమే కట్టి హైదరాబాద్ మొత్తం తానే కట్టానంటే చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్ షాహి ఏమనుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కొన్ని పనులు చేశారని, కానీ హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని చెప్పడం సరికాదన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కట్టిన మహానాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో అమరావతి ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. ఇంకా అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించే బదులు నిజంగా కట్టవచ్చు కదా అని పేర్కొన్నారు. ఆంధ్రాలో ఏదో పొడిచేసినట్లు తెలంగాణలో చంద్రబాబు నాయుడు వేలు పెడుతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగినప్పుడు ఒక తెలిసిన వ్యక్తిగా, మిత్రుడిగా దాడిని ఖండిస్తూ ఒక ట్వీట్ చేస్తే దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని ఆరోపించారు.
సోనియా గాంధీ మంచి వారే కానీ...
హైదరబాద్ లో ఇవాళ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కరెంటు కోతలు లేవని, శాంతిభద్రతల సమస్యలు లేవన్నారు. సోనియా గాంధీ మంచివారు... పెద్దావిడ.. రాజకీయాలు వదిలేశారని, కానీ ఇక్కడున్న నాయకులు ఆమెతో అబద్ధాలు చెప్పించారన్నారు. ఆమె కన్నతల్లిలా బాధపడింది స్వంత నియోజకవర్గంలోనే అమెథీ మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్ గాంధీ లాంటి కుమారుడు ఉన్నందునే ఆమె కన్నతల్లిలా బాధపడిందని, తెలంగాణ కోసం కాదన్నారు. వారు అప్పగించినప్పటి కంటే తెలంగాణ ఎంతో మెరుగైందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 కంపెనీలైన యాపిల్, గూగుల్, ఫేస్ బుక్, మెక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి హైదరాబాద్ లో సంస్థలు ఏర్పాటుచేశాయని, అది తమ గొప్పదనం కాదని.. హైదరాబాద్ గొప్పదనమన్నారు. తమకు చంద్రబాబులా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.