Mon Dec 23 2024 08:15:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లే : మంత్రి కేటీఆర్
కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నీ..
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో ఆరునెలల్లోనే రాష్ట్రంలో నెలకొన్ని విద్యుత్ సంక్షోభాన్ని తీర్చారన్నారు. ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన కేటీఆర్.. ఏపీలో తీవ్ర విద్యుత్ కొరత ఉందన్నారు.
అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నీ ఏపీలో సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు చెప్పారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉంటుందన్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఉన్న కొన్ని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్లగురించి మాట్లాడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందన్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను చెప్పేదేమి అతిశయోక్తి కాదన్న మంత్రి కేటీఆర్.. కావాలంటే ఏపీకి వెళ్లి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని సూచించారు.
ఏపీకి వెళ్లి తిరిగి తెలంగాణకు వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందని తన మిత్రులు తెలిపినట్లుగా మంత్రి చెప్పారు. ఎవరు అవునన్నా.. కాదన్నా దేశంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, త్వరలోనే నగరంలో ఫార్మా సిటీ ప్రారంభం కానుందని తెలిపారు. క్రెడాయ్ తన వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసి, భాగ్యనగర అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి కోరారు.
Next Story