Fri Nov 22 2024 22:28:14 GMT+0000 (Coordinated Universal Time)
వర్మతో భేటీ అనంతరం మంత్రి పేర్ని వ్యాఖ్యలు.. చట్టం అందరికీ ఒక్కటేనంటూ
మంత్రి పేర్నినాని వారిద్దరి భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో.. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి భేటీ ముగిసిన వెంటనే ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. తాజాగా మంత్రి పేర్నినాని వారిద్దరి భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమటోగ్రఫీ చట్టం ద్వారా జీవో నెం.35 ప్రకారం సినిమా టికెట్ల ధరలు నిర్దేశించామని చెప్పారు. ఎక్కడా చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని ఆర్జీవీ వివరించామన్నారు.
Also Read : ఏపీ కరోనా అప్ డేట్.. తాజాగా ఎన్నికేసులంటే..
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను నియంత్రించడంలో.. తమ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేమీ లేవని, తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని మంత్రి తెలిపారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదన్న నిజాన్ని అందరూ గ్రహించాలన్నారు. రెడ్ లైట్ పడినపుడు ఆగాలి. పసుపు లైటు వెలిగితే అటూ ఇటూ చూసుకోవాలి, పచ్చ లైటు వెలిగితే ముందుకు పోవాలి. ఈ రూల్ అందరికీ ఉంటుందని, అదే విషయాన్ని ఆర్జీవీకి వివరించానని మంత్రి చెప్పుకొచ్చారు.
కాగా.. 2013లో ఇచ్చిన జీవో నెం.100లో పేర్కొన్న దానికంటే టికెట్ల ధరను పెంచామన్న మంత్రి.. ఎవరికైనా టికెట్ల ధరలు ఇంకా పెంచాలన్న అభిప్రాయం ఉంటే మేం ఏర్పాటు చేసిన కమిటీతోనూ, లేక మాతోనూ మాట్లాడవచ్చని స్పష్టం చేశారు. ఎవరైనా వచ్చి మాట్లాడితే.. వారి అభిప్రాయాలను స్వీకరించి కమిటీకి నివేదిస్తామని మంత్రి పేర్నినాని తెలిపారు.
Next Story