Mon Dec 23 2024 06:51:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫైర్ బ్రాండ్ ఇలా బేలగా మారారేంటి?
మంత్రి రోజాకు తన సొంత సామాజికవర్గం నుంచే అసంతృప్తి ఎదురవుతుంది. సొంత పార్టీ నేతలే లెక్క చేయడం లేదు
పాపం.. రోజా.. మంత్రి పదవి వచ్చిందన్న సంతోషం లేదు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా సంతృప్తికరంగా ఉన్నారా? లేదా? అన్నది పక్కన పెడితే నియోజకవర్గంలో మాత్రం ఆమెకు నిద్రపట్టడం లేదు. ఎటు చూసినా అసమ్మతి. తన సొంత సామాజికవర్గం నుంచే ఆమెకు అసంతృప్తి ఎదురవుతుంది. మంత్రి అని కూడా నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే లెక్క చేయడం లేదు. వైరి పక్షం కంటే రోజాకు స్వపక్షంలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నారు. వారిని ఎదుర్కొనడం కష్టసాధ్యమయింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కంటే మంత్రిగా ఇప్పుడు రోజా బేలగా మారారు.
రెండుసార్లు గెలిచి....
నగరి నియోజకవర్గంలో రోజా రెండు సార్లు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధమవుతున్నారు. నగరిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణం, ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు రోజాకు కలసి వచ్చాయి. అంతకు ముందున్న బలంగా నగరిలో టీడీపీ లేదు. గాలి కుటుంబమే ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను చూస్తుండటంతో రోజాకు ఈసారి గెలుపుపై కూడా డౌట్ లేదు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన నాటి నుంచి ఆమెకు సొంత పార్టీలో శత్రువులు పెరిగిపోయారు.
రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత...
రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత కేజే కుమార్ వర్గంతో విభేదాలు తలెత్తాయి. అయినా జగన్ ఆయన సతీమణి కేజే శాంతికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీనికి తోడు చక్రపాణి రెడ్డితోనూ విభేదాలు వచ్చాయి. ఆయనను శ్రీశైలం ఆలయ కమిటీ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. అయితే మంత్రి పదవి కోసం పెదవి బిగబట్టి కోపాన్ని దిగమింగుకుని మరీ వెయిట్ చేశారు. చివరకు ఆమె ప్రయత్నం ఫలించింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు వీరిని వెనక ఉండి నడిపిస్తున్నారన్న అనుమానం కూడా రోజా అనుచరుల్లో ఉంది. కానీ పెద్దిరెడ్డిని కాదని వెళ్లే సాహసం చేయరు. అందుకే నియోజకవర్గంలో తన అసమ్మతిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లారు. కానీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. రాకపోగా ఇటీవల కాలంలో మరింత ఎక్కువయింది.
సొంత పార్టీలోనే....
ఇక మంత్రిగా అయిన తర్వాత కొంత అసమ్మతి తగ్గుతుందని భావించినా సాధ్యం కావడం లేదు. అసమ్మతి వర్గం తమ పని తాము చేసుకుపోతుంది. ఇటీవల నగరి నియోజకవర్గంలోని కొప్పేడులో మంత్రిగా ఉన్న రోజాకు తెలియకుండా రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేశారు. చేసింది శ్రీశైలం ఆలయ కమిటీ బోర్డు ఛైర్మన్ చక్రపాణిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ కేజే శాంతి కూడా హాజరయ్యారు. దీంతో ఆమె ఇలా అయితే తాను రాజీకీయాలు చేయలేనని ఆడియో సందేశం విడుదల చేశారు. తనను నియోజకవర్గంలో బలహీనపర్చే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆవేదన చెందారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ విపక్షాలకు సవాల్ విసురుతున్న రోజాకు మాత్రం సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోనే ఛాలెంజ్ లు ఎదురవుతున్నాయి. మరి దీని నుంచి రోజా ఎలా బయటపడతారో చూడాలి మరి.
Next Story