Fri Nov 15 2024 05:39:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ ఎన్నికలు.. టెన్షన్.. టెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 175 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ ఎన్నిక జరగనుంది. మొత్తం ఏడు ఎమ్మెల్సీ పోస్టులకు ఎనిమిది మంది బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా పంచుమర్తి అనూరాధను బరిలోకి దించింది. సాయంత్రం ఐదు గంటలనుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు తెలిపారు.
క్రాస్ ఓటింగ్ కు...
రెండు పార్టీలు క్రాస్ ఓటింగ్ కు తమ పార్టీ అభ్యర్థులు పాల్పడకుండా ఇప్పటికే విప్ జారీ చేశారు. రెండు పార్టీల్లో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉండటంతో టెన్షన్ గానే ఉంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీకి ఖాయం. ఏడో స్థానంలోనే ఇబ్బంది. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశముంది.
అసంతృప్త ఎమ్మెల్యేలు...
అలాగే వైసీపీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా పార్టీలో అసంతృప్తితో ఉండటంతో వైసీపీ హైకమాండ్ ఆ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించింది. దీంతో వారు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశముంది. అయితే రహస్య ఓటింగ్ కావడంతో ఎంతమంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారు? చెల్లని ఓట్లు ఉంటాయన్న దానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అన్ని పార్టీలు ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
మంత్రులకు బాధ్యతలు...
వైసీపీ తమ ఎమ్మెల్యేలకు ముందుగానే ఓట్లు మురిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. మాక్ పోలింగ్ ను నిర్వహించింది. ఎమ్మెల్యేల బాధ్యతను మంత్రులకు అప్పగించింది. వారే ఓటింగ్ కు ఎమ్మెల్యేలను తెచ్చి జాగ్రత్తగా తమ అభ్యర్థులకు ఓటు వేయించేలా చర్యలు తీసుకుంది. ఏ అభ్యర్థికి ఓటు ఎవరు వేయాలో ముందుగానే డిసైడ్ చేసింది. దీంతో ఈ ఎన్నిక కొంత టెన్షన్ గానే ఉంది. సాయంత్రం ఆరు గంటలకు ఫలితాలు వెలువడే అవకాశముంది. చంద్రబాబు కూడా ఈరోజు అసెంబ్లీకి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Next Story