Mon Dec 23 2024 11:44:41 GMT+0000 (Coordinated Universal Time)
మన దగ్గర బేరాలేవమ్మా
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. రెండు పట్టభద్రుల స్థానంలో ఆషామాషీ కాదు
ఊపిరి ఆడని కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్లు.. మండే ఎండల్లో వానలు కురిసినట్లు... ఎడారిలో చల్లని వాటర్ లభించినట్లు... చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. ఈ సయమంలో మూడు పట్టభద్రుల స్థానంలో రెండింటిలో గెలవడం ఆషామాషీ కాదు. ప్రచారం చేయకుండానే గెలుపు బాట పట్టడమంటే ఖచ్చితంగా ప్రభుత్వం పై వ్యతిరేకత అన్నది సుస్పష్టం. అధికార పార్టీ అభ్యర్థులతో సమానంగా ఖర్చు చేయక పోయినా గెలవడమంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా చంద్రబాబుకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పక తప్పదు. ఎన్నికలు ముందు వచ్చిన ఫలితాలు చంద్రబాబుకు భవిష్యత్ లో మరిన్ని నిర్ణయాలకు సానుకూలంగా మలచుకోవడానికి ఉపయోగపడతాయి.
కమ్యునిస్టులు బలపర్చినా...
ఈ ఎన్నికల్లో పొత్తు లేదు. చంద్రబాబు పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. జనసేన పొత్తు ఉందని విమర్శలు వినిపిస్తున్నా ఎక్కడా ఆ పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేయలేదు. ప్రచారానికి దిగలేదు. అంటే ఒంటరిగానే పోటీ చేసినట్లు. కాకుంటే వామపక్షాలు మాత్రం నేరుగానే బలపర్చాయని చెప్పాలి. ఉపాధ్యాయ ఎన్నికల్లో సరే కాని, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు అంత ఓటు బ్యాంకు లేదన్నది కూడా వాస్తవం. అంటే టీడీపీ సొంత బలంతోనే విజయం సాధించింది. ఈ విక్టరీ మామూలుది కాదు. నేతలు యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. భయపడకుండా అధికార పార్టీపై పోరాటానికి నేతలు ముందుకు వస్తారు. నాలుగేళ్ల నుంచి కేసులకు భయపడి దాక్కున్న నేతలు కూడా ఇక వీధిపోరాటం చేస్తారు.
గేమ్ చంద్రబాబు చేతిలోనే...
ఇక ప్రధానమైనది పొత్తుల విషయం. పొత్తుల్లో జనసేన అయినా, మరో పార్టీ అయినా చంద్రబాబు చెప్పినట్లు వినాల్సిందే. ఎందుకంటే కష్టసమయంలో వన్ సైడ్ విక్టరీ. పవన్తో పొత్తు కుదరక ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు చంద్రబాబుకు మార్గం సుగమం చేశాయి. బేరాల్లేవు. జనసేనకు బలం ఉన్న చోట మాత్రమే సీట్లు ఇస్తారు. అది ఇరవై కావచ్చు. ముప్ఫయి కావచ్చు. వైసీపీని ఓడించాలంటే నిన్న మొన్నటి వరకూ పవన్ పొత్తు చంద్రబాబుకు అవసరం. కానీ నేడు సీన్ మారింది. ఇచ్చినన్ని సీట్లు పవన్ తీసుకోవాల్సిందే. పొత్తుల చర్చల్లోనూ చంద్రబాబుదే పై చేయిగా మారనుంది. బాబు ఎన్ని ఇస్తే అన్ని.. ఎక్కడయితే అక్కడ పోటీకి దిగాల్సి ఉంటుంది. గేమ్ ను చంద్రబాబు తన చేతిలోకి ఈ ఎన్నికల ఫలితాలతో తీసుకున్నట్లయింది.
తనయుడు క్రేజ్ కూడా...
టిక్కెట్ల కేటాయింపులో నిన్నటి వరకూ తటపటాయించిన బాబు నేతలు తలెగరేయకుండా చేసుకోగలిగారు. ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు వల్ల గెలిచారని చెప్పలేం. ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ చంద్రబాబు మాత్రం ఇది తనకు అనుకూలంగా మార్చుకోగలరు. తన సమర్థత చూసి గ్రాడ్యుయేట్లు ఓట్లేశారని చెప్పుకునే అవకాశం టీడీపీ అధినేతకు దక్కుతుంది. ఇక చేరికలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. నిన్నటి వరకూ పార్టీలో చేరేందుకు సంశయించిన నేతలు ఇక ఏమాత్రం సంకోచించరు. కండువాలు కప్పడంలోనే బాబు బిజీ అవుతారని చెప్పకతప్పదు. ఈవీఎంలు కాకుండా బ్యాలట్ అయితే తమదే గెలుపన్న చంద్రబాబు గతంలో చేసిన వాదనకు కూడా బలం చేకూరినట్లయింది. లోకేష్ పాదయాత్ర కూడా పనిచేసిందన్న వాదన బలంగా వినిపించవచ్చు. తన కుమారుడిని తక్కువగా అంచనా వేయవద్దని సంకేతాలు ఇవ్వొచ్చు. పార్టీలో తన తర్వాత లోకేష్ అని గట్టిగా చెప్పే ఛాన్స్ చంద్రబాబుకు దొరికింది. చూశారా.. ఒక్క ఎన్నిక చంద్రబాబు ఆందోళనను తగ్గించింది. రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది.
Next Story