Sun Mar 30 2025 03:13:55 GMT+0000 (Coordinated Universal Time)
MLC Elections : నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో వాతావరణం హీటెక్కింది. అయితే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది. విపక్ష పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ, తెలంగాణలోని విపక్ష బీఆర్ఎస్ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ వర్సెస్ ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉంది. అలాగే తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉంది. పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. వచ్చే నెల 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదాావరి జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రధాన పోటీ టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యనే ఉంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఏపీటీఎఫ్ అభ్యర్థికి టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించగా, బీజేపీ మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి 35మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. గుంటూరు స్థానానికి ఇరవై ఐదు మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోస్టుకు పది మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు నేడు జరగనున్నాయి. ప్రతి జిల్లాలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు మంత్రులను భాధ్యులుగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ బరిలో లేకపోవడంతో బీజేపీ ఆ ఓట్లు తమకే పడతాయని ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద పోలింగ్ ప్రారంభం కావడంతో ఎవరువిజేతలని తేలడానికి మరో ఐదు రోజుల సమయం పట్టే అవకాశముంది.
Next Story