ఇద్దరు హ్యాట్రిక్ - ఒకరు రెండో సారి!
కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని టైమ్స్ నౌ, నవభారత్ మీడియా సంస్థల సర్వే వెల్లడించింది. వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని తెలిపింది.
అక్కడ మోదీ, తెలుగు రాష్ట్రాల్లో జగన్, కేసీఆర్
టైమ్స్ నౌ, నవభారత్ మీడియా సంస్థల సర్వే
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే అంచనాలు తారుమారు!
కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని టైమ్స్ నౌ, నవభారత్ మీడియా సంస్థల సర్వే వెల్లడించింది. వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని తెలిపింది. 265 నుంచి 325 వరకూ ఎంపీ స్థానాలను గెలుచుకుని భారతీయ జనతాపార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. 112 నుంచి 165 లోక్సభ స్థానాలను సాధించి కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా నిలవనుందని సర్వే ప్రకటించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, లోక్సభ సభ్యత్వం రద్దు అతనికి అనుకూలించినా, అధికార పీఠానికి చాలా దూరంలోనే కాంగ్రెస్ నిలిచిపోనుంది.
ఆంధ్రలో మళ్లీ వైకాపా! తెలంగాణాలో గులాబీ!
ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 25 ఎంపీ స్థానాలను సాధించి పార్లమెంట్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలవనుంది. ఈ సర్వే ప్రకారమైతే రాష్ట్రంలో వైకాపా సునాయాసంగా విజయం సాధించి, రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. స్థానికంగా అధికార పార్టీతో నిరంతరం పోరాడుతున్న తెలుగుదేశానికి ఒక్క ఎంపీ సీటు దక్కనుందని సర్వే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైతే ఈ సర్వే ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. దేశవ్యాప్తంగా అనుకూల ఓటు దక్కించుకునే బీజేపీ హవా ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగితే, అది తెలుగుదేశానికి అనుకూలంగా ఉండవచ్చు. 2014 స్థాయిలో ఏపీలో బీజేపీకి పాజిటివ్ ఓట్ ఉంటుందా అనేదే అసలు ప్రశ్న. తెలంగాణలో కూడా 9నుంచి 11స్థానాలు సాధించి భారాస అధికారాన్ని అందుకుంటుంది. కేంద్ర స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆ పార్టీ ఆశలు తీరేలా లేవు.
రానున్నది సర్వేల కాలం
ఓటర్ల మూడ్ను తెలుసుకోడానికి ఇక అన్ని మీడియా సంస్థలు, సెఫాలజిస్టులూ సర్వేల బాట పడతారు. ఇరవై రోజుల కిందట ఇండియా టుడే కూడా తాను నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. అందులో కూడా కేంద్రంలో మళ్లీ మోదీ, ఆంధ్రలో జగన్ అధికారంలోకి వస్తారని ప్రకటించింది. దాదాపు అన్ని మీడియా సంస్థలు, సర్వే సంస్థల సహాయంతో జనం అభిప్రాయాన్ని తెలియజేస్తుంటాయి. మొన్న జరిగిన కర్నాటక ఎన్నికల్లో దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని ప్రకటించాయి. అదే నిజమైంది కూడా. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు, వ్యక్తులు ‘స్వీయ’ సర్వేలతో జనం అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయి. 2014లో వైకాపా అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలను ‘సాక్షి’ ప్రకటించింది. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. 2019లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీ అనుకూల మీడియా వెల్లడిరచింది. ఆంధ్రా అక్టోపస్గా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా సైకిల్ పార్టీదే అధికారం అని ప్రకటించారు. వైకాపా రికార్డు మెజార్టీతో అధికారం చేపట్టింది. మరి ఈ సరి సర్వేలు, వాటిలో నిజానిజాలు తెలియాలంటే పది నెలలు ఆగాల్సిందే.