Sat Nov 23 2024 23:07:39 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ పట్టించుకోలేదా?
తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ కేసీఆర్ ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు
మోదీ కేసీఆర్ ను లైట్ గా తీసుకున్నారా? అసలు కేసీఆర్ గురించి ఆలోచించనట్లే మోదీ ఎందుకు వ్యవహరించారు? కేసీఆర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నారా? అవును.. హైదరాబాద్ లో బీజేపీ విజయ్ సంకల్ప్ సభకు వచ్చిన వారంతా ఈ ప్రశ్నలే వేసుకుంటున్నారు. సభకు జనం భారీగా వచ్చారు. జనసమీకరణ బాగా చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్ కు చేరుకున్నారు. మోదీ ప్రసంగం వినేందుకు ఓపిగ్గా కొన్ని గంటల పాటు వెయిట్ చేశారు. కానీ మోదీ తన ప్రసంగాన్ని చప్పగా ముగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రసంగం సాగిందన్న వ్యాఖ్యలు బీజేపీ నేతల నోటి నుంచే వినిపించాయి.
మోదీపై విమర్శలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్నాళ్లుగా మోదీపై ఒంటికాలిపై లేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు కూడా రెడీ అయిపోయారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు పలికారు. మోదీతో పాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అవకాశమొచ్చినప్పుడల్లా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చివరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న మోదీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున టీఆర్ఎస్ నేతలు హోర్డింగ్ లు పెట్టారు. అలాంటిది మోదీ బహిరంగ సభలో కేసీఆర్ ను దుమ్ము దులిపేస్తారనుకున్నారు.
ప్రస్తావనే లేదు...
కానీ కేసీఆర్ ప్రస్తావనే మోదీ ప్రసంగంలో లేదు. అంతమంది జనం ఉన్నా మోదీ కేసీఆర్ పేరు ఎత్తలేదు. తెలంగాణలో కేసీఆర్ పరిపాలనపై విమర్శల జోలికి పోలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసినే అభివృద్ధి పనులతో పాటు తెలంగాణకు తమ ప్రభుత్వం ఏమేం చేసేమో చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో ఏం చేస్తామో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
అందుకేనా?
ఎందుకు మోదీ కేసీఆర్ పై విమర్శలు చేయలేదు. కాంగ్రెస్ మాత్రం ఇద్దరికీ అవగాహన ఉన్నందుకే విమర్శలకు దూరంగా ఉన్నారంటుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన నేత కాదని మోదీ అశేష జనం సాక్షిగా చెప్పకనే చెప్పారంటున్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ తన మీద చేసే విమర్శలు గాలికి కొట్టుకుపోతాయని, ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోరన్న ధీమా కాబోలు. మోదీ కేసీఆర్ ఊసే ఎత్తలేదు.
Next Story