Mon Dec 23 2024 14:19:46 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు "బాబు"ల భేటీ... అందుకేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించినట్లు తెలిసింది. అయితే మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల సందర్భంగా మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. సాయంత్రం 4 గంటలకు వెళ్లిన మోహన్ బాబు ఆరు గంటల వరకూ చంద్రబాబుతో చర్చించారు.
రాజకీయంగా...
మోహన్ బాబు చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు తనకు రాజ్యసభ పదవి వస్తుందని భావించారు. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి అయినా దక్కుతుందని ఆశించారు. కానీ వైసీపీ అధినేత మాత్రం మోహన్ బాబును పట్టించుకోలేదు. మళ్లీ టీడీపీలోకి రావాలని మోహన్ బాబు ప్రయత్నిస్తున్నట్లే కనపడుతుంది. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీకి కూడా మోహన్ బాబు హాజరు కాలేదు.
టాలీవుడ్ చర్చలకు...
గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం పై టీడీపీకి వ్యతిరేకంగా ధర్నా చేశారు. అనంతరం వైసీపీకి మద్దతు పలికారు. జగన్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం కూడా ఉంది. అయితే జగన్ టాలీవుడ్ సినిమాపై పలు దఫాలు చర్చలు జరిపితే కనీసం తనను ఆహ్వానించలేదన్న కినుకతో మోహన్ బాబు ఉన్నట్లు సమచారం. చిరంజీవి, మహేష్ బాబు వంటి వారిని పిలిపించుకుని చర్చలు జరిపిన జగన్ తమ కుటుంబాన్ని అవమానించారని మోహన్ బాబు గట్టిగా భావిస్తున్నారు.
అప్పటి నుంచే...
అప్పటి నుంచే మోహన్ బాబు వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇటు సినిమాల పరంగా తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మరోవైపు అధికారంలో ఉన్నప్పటకీ ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కమ్మ సామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేయడం, ఏ ఒక్కరికీ పదవి ఇవ్కవపోవడంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అందువల్లనే చంద్రబాబును కలసిన మోహన్ బాబు ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story