Mon Dec 23 2024 09:23:57 GMT+0000 (Coordinated Universal Time)
మోత్కుపల్లి ఆశ గల్లంతేనా?
తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు. ఆయన కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పదవులకు అందనంత దూరంగా ఉంటున్నారు
తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు. ఆయన కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పదవులకు అందనంత దూరంగా ఉంటున్నారు. పార్టీలు మారినా ఫలితం లేదు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. దీంతో మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో కొన్నాళ్లున్న ఆయన అక్కడ కూడా పొసగక అధికార టీఆర్ఎస్ లో చేరారు.
దళితనేతగా....
దళిత నేతగా మోత్కుపల్లి నరసింహులుకు ఒకప్పుడు మంచి పట్టుండేది. రాజకీయ పార్టీలు కూడా ఆయనను దళిత నేతగా గుర్తించేవి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేసిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పట్ల ఆకర్షితుడయ్యారు. దళిత నేతగా తనకు కేసీఆర్ పదవి ఇస్తారని భావించారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించినా కేసీఆర్ ఆ దిశగా ఆలోచన చేయకవపోవండంతో మోత్కుపల్లి సైలెంట్ అయ్యారు.
రానున్న రెండు నెలల్లో....
కానీ వచ్చే రెండు మూడు నెలల్లో రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. ఎన్నికల సమయం కావడంతో దళితులకు ప్రాధాన్యత ఇస్తే తనకు రాజ్యసభ పదవి దక్కుతుందని మోత్కుపల్లి పెద్ద ఆశలే పెట్టుకున్నారు. డి.శ్రీనివాస్ రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి రావడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ రెండింటిలో ఒకటి తనకు దక్కుతుందని మోత్కుపల్లి నరసింహులు భావిస్తున్నారు.
కేసీఆర్ లెక్కలేంటి?
కానీ కేసీఆర్ మనసులో ఏముందో తెలియదు. ఎన్నికల లెక్కలను బట్టి పదవుల భర్తీ ఉంటుంది. సామాజికవర్గాల సమీకరణాలను తీసుకుంటారా? లేదా మరో దిశగా పోస్టులను భర్తీ చేస్తారా? అన్నది తెలియదు. దీంతో మోత్కుపల్లి నరసింహులు భవిష్యత్తు మరో రెండు నెలల్లో తేలనుంది. రాజ్యసభ పదవి వస్తే అంతకంటే అదృష్టం ఉండదు. కానీ ఫేట్ బాగా లేకపోతే చెప్పలేం. అందుకే మోత్కుపల్లికి పదవి రాత ఉందా? లేదా? అన్నది కొద్దిరోజుల్లోనే తెలియనుంది.
Next Story