Thu Jan 16 2025 17:26:12 GMT+0000 (Coordinated Universal Time)
బెయిల్ రద్దయితే బీజేపీకి లాభమా?
ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది
జగన్ కు, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందా? ఇద్దరి మధ్య మాటల యుద్ధం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై బీజేపీ ఎన్నడూ విమర్శలు చేయలేదు. చివరకు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో బెయిల్ పై ఉన్న వాళ్లు జైలుకు వెళతరాన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అని చెబుతున్నాయి.
తీర్పును రిజర్వ్ చేసినా....
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు వచ్చే లోగా జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో ఎంతో కొంత బలాన్ని ప్రదర్శించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. అందుకోసమే అధికార వైసీపీని టార్గెట్ చేసిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
జగన్ తమ వద్దకు వస్తారన్న....
జగన్ అవసరమొచ్చినప్పుడు తమ వద్దకు వస్తారన్న విశ్వాసం బీజేపీ కేంద్ర నాయకత్వంలో కన్పిస్తుంది. అందుకే రాష్ట్ర నాయకత్వానికి రూట్ మ్యాప్ సెట్ చేసి ఇచ్చారంటున్నారు. నిన్న జరిగిన జనాగ్రహ సభ ఇందుకు ఉదాహరణ. అమరావతిలో రాజధానిని తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టుకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీ నేతలు జగన్ కు దూరంగా జరగాలనే నిర్ణయించినట్లు చెబుతున్నారు.
టీడీపీని బలహీనపర్చాలనేనా?
ఈ వ్యూహం వెనక ఒక కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. టీడీపీని బలహీనం చేయడమే లక్ష్యంగా బీజేపీ లోని ఒకవర్గం ప్రయత్నిస్తుంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా, పవన్ కల్యాణ్ ను దూరం చేసుకోకుండా టీడీపీని వచ్చే ఎన్నికల్లో బలహీనం చేస్తే అది జగన్ కు ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారనేది చంద్రబాబును అడగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే బెయిల్ పై ఉన్న నేతలు జైలుకు వెళితే బీజేపీకి వెనువెంటనే వచ్చే లాభమేంటి? అందుకే పార్టీని కేంద్ర నాయకత్వం యాక్టివ్ చేసిందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాలు బెయిల్ రద్దు అంశం హాట్ టాపిక్ గా మారింది.
Next Story