Sat Nov 23 2024 05:09:49 GMT+0000 (Coordinated Universal Time)
ఇంత చేసిన ముద్రగడ చివరకు కోవర్టా?
కాపుల సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఒంటరి అయినట్లే కనిపిస్తుంది
కాపుల సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఒంటరి అయినట్లే కనిపిస్తుంది. ఆయన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదనిపిస్తుంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖతో ఆయన బేలతనం ప్రదర్శించడం కాపు సామాజికవర్గంలో చర్చనీయాంశమైంది. ముద్రగడను ఎవరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సొంత సామాజికవర్గం నేతలే ఆయనను కోవర్టుగా భావిస్తున్నారు.
నాలుగు దశాబ్దాలు....
ముద్రగడ పద్మనాభం నాలుగు దశాబ్దాలున్న రాజకీయ నేత. నిబద్దత, నిజాయితీ కలిగిన నేతగా పేరు పొందారు. ప్రయివేటు బస్సులకు అనుమతిచ్చిన వెంటనే ఆయన తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న నేతగా ఆయన ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మూడు దశాబ్దాలు పాటు ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసమే పాటు పడ్డారు.
కాపు సంక్షేమం కోసం....
అయితే 2014 ఎన్నికల తర్వాత నుంచి ముద్రగడ పద్మనాభంపై ఒత్తిడి మరింత ప్రారంభయింది. తుని సంఘటనను ఆయనను ఇబ్బంది పెట్టింది. కాపు రిజర్వేషన్ల కోసం కిర్లంపూడి లోనే దీక్షకు దిగారు. ఆయన దీక్షను భగ్నం చేయడంలో తనను, తన కుటుంబాన్ని అవమానపర్చారని మరింత వేదనకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముద్రగడ దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో ముద్రగడ పద్మనాభంపై ట్రోల్ ప్రారంభమయింది. కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం నుంచే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. అందుకే ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నట్లు ప్రకటించారు.
దూరం పెట్టి....
కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో నమోదయిన కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆయన స్వాగతించారు. జగన్ ను స్వయంగా కలసి కృతజ్ఞతలు తెలియజేయాలని ఉన్నా ట్రోలింగ్ కు భయపడి ముద్రగడ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరో వైపు కాపు నేతలంతా కలసి ఒక వేదికను ఏర్పాటు చేేసుకుంటున్నారు. దీనికి కూడా ముద్రగడను పక్కన పెట్టారు. సుదీర్ఘకాలం కాపు సంక్షేమం కోసం ఆయన పడిన శ్రమకు ఇదేనా గుర్తింపు అంటూ ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పాపం ముద్రగడ కాపు జాతి కోసం పోరాడి చివరకు తానే కోవర్టుగా మారారన్న విమర్శలే ఆయనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి.
Next Story