Mon Dec 23 2024 02:04:41 GMT+0000 (Coordinated Universal Time)
కామెడీ షో.. చివరకు ట్రాజెడీ అయిందే?
మునావర్ కామెడీ షో రాజాసింగ్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. మునావర్ షో ను రాజాసింగ్ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు
మునావర్ ఫారుఖీ కామెడీ షో ఎంత పనిచేసింది? చివరకు ఒక ఎమ్మెల్యే రాజకీయ జీవితంలో మచ్చ పడింది. పీడీ యాక్ట్ వచ్చి చేరింది. ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే రాజాసింగ్ కు ట్రాజెడీ షోగా మారింది. రాజాసింగ్ లో ఇప్పుడు కొత్తగా కేసులు లేకపోవచ్చు. గతంలోనే ఆయనపై 101 కేసులు నమోదయ్యాయి. అందులో 18 కేసులు మతపరమైన దూషణలకు పాల్పడినవే. ఈ కేసుల్లో ఎప్పుడూ ఇంతగా రాజాసింగ్ ఇబ్బంది పడలేదు.
ఆ షోను తొలి నుంచి...
కానీ మునావర్ కామెడీ షో రాజాసింగ్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. మునావర్ షో ను రాజాసింగ్ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ షోకు అనుమతి ఇవ్వవద్దని, ఇస్తే స్టేజీని తగలపెడతానంటూ హెచ్చరించారు. అయినా పోలీసులు మాత్రం మునావర్ షో కు మాత్రం అనుమతి ఇచ్చారు. మునావార్ షోలో హిందూ దేవుళ్లను దూషిస్తారని, అందుకే ఆ షోను అనుమతించవద్దని రాజాసింగ్ కోరారు. అయితే పోలీసుల పహారా మధ్య షో ముగియడంతో రాజాసింగ్ రెచ్చిపోయారు. ఒక మతాన్ని కించపరుస్తూ వీడియోను విడుదల చేశారు.
పీడీ యాక్ట్ పెట్టడం...
అదే ఆయనకు శాపంగా మారింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిది. ఆయన చేసిన పనితో హైదరాబాద్ మూడు రోజుల పాటు అట్టుడికి పోయింది. ముఖ్యంగా ఒక వర్గం నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనలపై సీరియస్ అయింది. యాక్షన్ కు దిగింది. ఫలితంగా తొలిసారి ఎమ్మెల్యే పై పీడీ యాక్ట్ నమోదయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీనే సమర్థించలేదు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అందుకు ఉదాహరణ.
ప్లస్సా.. మైనస్సా?
అయితే రాజాసింగ్ కు ఈ ఘటన రాజకీయంగా ప్లస్ అవుతుందా? మైనన్ అవుతుందా? అన్నది పక్కన పెడితే ఆయనకు మాత్రం ప్రస్తుతం చెడ్డ రోజులు నడుస్తున్నట్లే అనుకోవాలి. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా హైదరాబాద్ తయారవుతుందని భయపడిన వారు లేకపోలేదు. ప్రస్తుతమున్న పరిస్థితులలో రాజాసింగ్ ను కట్టడి చేయకపోతే శాంతిభద్రతలు తలెత్తే అవకాశముందని భావించి పోలీసులు యాక్షన్ లోకి దిగారు. శాసనసభలో ఉండాల్సిన ఎమ్మెల్యే జైలు పక్షిలా మారారు. మొత్తం మీద రాజాసింగ్ రాజకీయ జీవితంలో కామెడీ షో.. ట్రాజెడీ గా ముగిసింది.
Next Story