Mon Dec 23 2024 01:32:43 GMT+0000 (Coordinated Universal Time)
సర్వేల మీద సర్వేలు... అభ్యర్థి ఎవరో?
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. సర్వేలు చేయించుకుని అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలు నవంబర్ నెలలో జరుగుతాయని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి పోటీ చేయడం ఖాయం. కానీ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంత వరకూ అభ్యర్థులను నిర్ణయించలేదు. రెండు పార్టీల్లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. కానీ మూడు పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ ది సిట్టింగ్ స్థానం. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, తామే గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.
కోమటిరెడ్డి గెలవకపోతే...?
బీజేపీ సిట్టింగ్ స్థానం కాకపోయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ఈ ఉప ఎన్నిక ప్రిస్టేజ్. ఆయన తిరిగి ఈ ఎన్నికల్లో గెలవలేకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు. ఆ కుటుంబం పరువు మంట గలుస్తుంది. అందుకే ఆయన ఉప ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ కు సవాల్ విసిరడమే కాకుండా, బీజేపీలో పట్టు పెంచుకోవాలని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో పోటీ చేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవికి కన్నా ఎంపీ పదవినే ఎక్కువగా ఇష్టపడతారు.
సర్వే నివేదిక ప్రకారం...
ఇక అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి భారీ బహిరంగ సభను పెట్టారు. మరోసారి చుండూరులో సభ పెడతానని ఆయన ఇటీవలే స్పష్టం చేశారు. ఇక అధికార పార్టీ కావడంతో పోటీకి చాలా ముంది ముందుకు వస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. 2014లో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే బీసీలకు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుంది. బీసీల్లో కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ లు తమకు కావాలని కోరుతున్నారు. అయితే సర్వే నివేదికల ప్రకారమే కేసీఆర్ అభ్యర్థిని నిర్ణయించడం గ్యారంటీ. ఎందుకంటే సెమీ ఫైనల్ లో గెలిచి తీరాల్సిన పరిస్థితి.
పోటీ ఎక్కువే....
ఇక కాంగ్రెస్ కూడా సర్వేలు చేయిస్తుంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు అభ్యర్థులను ఇంటర్వ్యూలు కూడా చేశారు. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత ఉన్నారు. రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే పాల్వాయి స్రవంతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మిగిలిన ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉంటాయి. అయితే సర్వేలో మాత్రం పాల్వాయి స్రవంతి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తేలిందంటున్నారు. అదే నిజమైతే ఆమెనే అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారు. మొత్తం మీద రెండు ప్రధాన పార్టీలు సర్వేల సర్వేలు చేయిస్తున్నాయి. చివరకు సర్వేల్లో ఎవరి వైపు అత్యధికంగా మొగ్గు చూపితే వారి అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నారు. మొత్తం మీద మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలు కూడా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి.
Next Story