Mon Dec 23 2024 01:08:03 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో ముంచేది...తేల్చేది...?
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక ముఖ్యం
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ సెమీ ఫైనల్స్ వంటివి. అందుకే ప్రతి పార్టీ మునుగోడుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీజేపీ అభ్యర్థి ముందుగానే డిసైడ్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీయే తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
వ్యూహం మార్చుకుంటుందా?
ఇప్పుడు అధికార టీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకునే వీలుందంటున్నారు. రెడ్డి సామాజికవర్గానికి కాకుండా బీసీలకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇది ఫైనల్ కాదు. గులాబీ పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రచారమే. ఖచ్చితంగా గెలవాలనుకుంటున్న గులాబీ బాస్ వివిధ స్థాయిల్లో అనేక సార్లు సర్వే చేయించారు. సర్వే నివేదికల ప్రకారం అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేయనున్నారు. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నా ఫైనల్ గా ఎవరి పేరును కేసీఆర్ ఖరారు చేస్తారన్న ఉత్కంఠ మునుగోడు పార్టీ నేతల్లో నెలకొంది.
ఆయనకే మరోసారి...
ఇక మునుగోడు ఇన్‌ఛార్జి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అందరినీ సమన్వయం చేసుకునే వెళ్లే బాధ్యతను ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. మంత్రి హరీశ్ రావుకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. అయితే ఆ రెండు ఎన్నికలు దెబ్బకొట్టాయి. మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి అప్పగించే అవకాశముంది. నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపులో మంత్రి జగదీష్ రెడ్డి కీలక బాధ్యతలను నిర్వహించారు.
మంత్రికీ ప్రతిష్టాత్మకం...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో మునుగోడు ఉప ఎన్నిక కూడా గెలుస్తామన్న ధీమాతో అధికార టీఆర్ఎస్ ఉంది. అందుకే జగదీష్ రెడ్డికే ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయి. గ్రామాల వారీగా ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జిని నియమించినా ఓవరాల్ గా పర్యవేక్షణ బాధ్యతను జగదీష్ రెడ్డికే అప్పగిస్తారంటున్నారు. అందరినీ కలుపుకుని పోతూ పార్టీ నేతలను సమన్వయం చేసుకునేలా ఆయన వ్యవహరిస్తారని పార్టీ అధినాయకత్వం కూడా నమ్ముతుంది. అందుకే ఈ ఉప ఎన్నిక కేసీఆర్ తో పాటు ఆ ప్రాంతానికి చెందిన మంత్రిగా జగదీష్ రెడ్డికి కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమేనని చెప్పాలి.
Next Story