Tue Nov 05 2024 16:39:11 GMT+0000 (Coordinated Universal Time)
సైలెంట్ ఓటు దేనికి సంకేతం?
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం ఎవరికి లాభమన్న చర్చ జరుగుతోంది
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ నుంచి గెలిచి రాజీనామా చేసి బీజేపీ లో చేరి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత తెలంగాణలో జరుగుతున్న ఎన్నిక కావడంతో టీఆర్ఎస్ కు కూడా అంతే. అలాగే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలో గెలిచి తీరాల్సిన పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఎక్కువ పోలింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ జరుగుతుంది.
పోలింగ్ ఎక్కువగా...
సాధారణ ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ జరిగితే అది అధికార పార్టీకే నష్టమని అంచనా వేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది కాబట్టి ఎక్కువ ఓట్లు పోలయితే అధికార పార్టీకి నష్టమని అనేక ఎన్నికల ఫలితాలు గతంలో చెప్పాయి. అయితే ఇది ఉప ఎన్నిక కావడంతో ఆ థియరీ వర్క్ అవుట్ కాదు. ఎక్కువ శాతం పోలింగ్ ఇక్కడ అధికార పార్టీకే అనుకూలమని చెబుతున్నారు. సర్వేలు కూడా అవే వెల్లడించాయి. టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, మెజారిటీ ఎంతో తేలాలంటూ ఆ పార్టీ నేతలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ధీమా అదేనా?
కానీ సైలెంట్ ఓటింగ్ తో గెలుస్తామన్న నమ్మకంతో బీజేపీ ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతోనే మునుగోడుకు ప్రభుత్వం అభివృద్ధి పనులను మంజూరు చేసిందని, మునుగోడులో నెలన్నర రోజుల పాటు పండగ వాతావరణం నెలకొందని, అందుకనే ఓటర్లు తమ వైపు ఉంటారని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వల్లనే తమ సమస్యలు కొంత వరకైనా తీరాయన్న భావనలో ఓటరు ఉండటం తమకు కలసి వచ్చేదిగా కమలం పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. మెజారిటీ పెద్దగా లేకపోయినా గెలుపు తమదేనన్న ఆత్మవిశ్వాసంతో కమలం పార్టీ నేతలు ఉన్నారు.
సానుభూతి పనిచేస్తుందని...
ఇక కాంగ్రెస్ పార్టీది వేరే దారి. మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం తమను గెలుపు దిశగా పయనింపచేస్తుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. మహిళ కావడం, సానుభూతి రావడంతో తమకు ఓటర్లు ఇంటర్నల్ గా మద్దతు తెలిపారని భావిస్తున్నారు. తాము డబ్బులు పంచకపోయినా ఈసారికి తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్న కసి ఓటర్లలో కనిపించిందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. మొత్తం మీద మునుగోడులో మూడు ప్రధాన పార్టీలు భారీగా తమ గెలుపుపై అంచనాలను పెట్టుకున్నాయి. మరి ఎవరిది గెలుపు అన్నది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే.
Next Story