Mon Dec 23 2024 01:52:31 GMT+0000 (Coordinated Universal Time)
మెగా ఫ్యామిలీకి గుదిబండలా మారారా?
నాగబాబు మాత్రం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారు. రాజకీయాలు కావచ్చు. సినిమా ఇండ్రస్ట్రీ కావచ్చు
మెగాస్టార్ చిరంజీవి తన కష్టంతో సినిమా ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఏమీ లేని స్థాయి నుంచి మెగాస్టార్ అయ్యారంటే ఆయనకున్న అణుకువ, మంచితనం, ఎంత ఎదిగినా ఒదిగే తత్వం. చిరంజీవి సున్నిత మనస్కుడు. ఆయనను ఎవరైనా విమర్శించినా పెద్దగా పట్టించుకోరు. ఆయనే తిరిగి తనను విమర్శించిన వారి వద్దకు వెళ్లి ఆలింగనం చేసిన ఘటనలు ఉన్నాయి. ఆయన పడిన కష్టం కారణంగానే మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. చిత్రపరిశ్రమలో ఆయన చెప్పిందే వేదం. ఆరుపదులు దాటినా ఆయనతో సినిమా తీయాలని ఇప్పటికీ నిర్మాతలు చిరు ఇంటి ముందు క్యూ కడుతున్నారంటే అది ఆయనకున్న స్టామినా. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తెలుగు ఇండ్రస్ట్రీని ఏలుతున్నది మెగాస్టార్ మాత్రమే.
చిరంజీవి లేకుంటే...?
తనతో పాటు తన కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఎదిగేందుకు దోహదం చేశారనడంలో సందేహం లేదు. అయితే ఆయన సోదరుడు నాగబాబు మాత్రం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారు. రాజకీయాలు కావచ్చు. సినిమా ఇండ్రస్ట్రీ కావచ్చు. తరచూ వివాదాలతో నాగబాబు మెగా కుటుంబానికి తలనొప్పిగా మారారు. తలవంచుకునేలా చేస్తున్నారు. నాగబాబు వయసుకు తగ్గట్లు వ్యహహరించరు. ఆయనకు ఆయన తాను స్పెషల్ అని భావించడమే అసలు సమస్య. రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ను, సినిమాల్లో ఉన్న చిరంజీవిని, చిరు కుటుంబాన్ని ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కానీ ఎవరు విమర్శలు చేసినా కొంత హద్దుల్లో వ్యవహరించాలి. విమర్శలకు వివరణ చేయొచ్చు. ప్రతి విమర్శలు కూడా ఎవరూ కాదనరు.
తమ్మారెడ్డి విషయంలో...
కానీ హుందాగా నడుచుకోకుంటేనే అసలు సమస్య. తమ్మారెడ్డి భరధ్వాజ విషయంలో నాగబాబు ఇండ్రస్ట్రీ నుంచే కాదు.. సాధారణ ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పు పడుతున్నారు. తమ్మారెడ్డి భరధ్వాజ నిజంగానే RRR సినిమాపై విమర్శలు చేయవచ్చు. అది ఆయనకున్న భావ ప్రకటన. సినిమా ఒకరికి నచ్చొచ్చు. ఇంకొందరికి నచ్చకపోవచ్చు. చూసే వారి కోణంపై ఆధారపడి ఉంటుంది. మలయాళ సినిమాలు ఓటీటీలో విడుదలయినా బ్లాక్బస్టర్లవుతున్నాయన్న విషయాన్ని నాగబాబు మరిచిపోయారంటున్నారు. తమ్మారెడ్డి భరధ్వాజ అన్నదానిలో తప్పేంది? ఆస్కార్ అవార్డు కోసం RRR సినిమా వాళ్లు ఖర్చు చేసిన ఎనభై కోట్లతో పది సినిమాలు నిర్మించవచ్చని ఆయన తెలిపారు. అందులో వాస్తవం లేదా? భారీ సినిమాలు, మెగా ఫ్యామిలీ నటిస్తేనే సినిమా కాదు. చిన్న సినిమాలు కూడా సక్సెస్ అయిన దాఖలాలున్నాయి. మెగా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పట్టిన ఘటనలూ చూశాం.
ఆ గర్వం కాక...?
కానీ నాగబాబు తమ్మారెడ్డి భరధ్వాజ విషయంలో నోరు పారేసుకున్నారన్నది వాస్తవం. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు కె.రాఘవేంద్రరావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయన కౌంటర్ ఏమీ విమర్శలకు నోచుకోలేదు. మెగా బ్రదర్ అన్న గర్వంతోనే నాగబాబు తరచూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తమ్మారెడ్డి భరధ్వాజను పట్టుకుని నీయమ్మ మొగుడు డబ్బులు ఖర్చు పెట్టాడా? అన్న వ్యాఖ్యలపై నాగబాబు ట్రోలింగ్ కు గురవుతున్నారు. సినీ పరిశ్రమలోనూ నాగబాబు చేసిన విమర్శలను ఎవరూ సమర్థించడం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్లు గౌరవంగా చెప్పుకోవచ్చు. అంతేకాని వీధి మనుషుల్లా వెండి తెర నాయకులు కూడా ప్రవర్తిస్తే దానికి అనడానికి ఏముంటుంది. ఇక ఈ వయసులో నాగబాబు మారతారని ఊహించడమూ కష్టమే. ఆయన మెగా కుటుంబానికి మాత్రం అస్సెట్ గా కాదు... గుదిబండగా తయారయ్యారన్న కామెంట్స్ మాత్రం వినపడుతున్నాయి.
Next Story