Wed Dec 25 2024 15:21:36 GMT+0000 (Coordinated Universal Time)
నల్లారిలో కసి పెరిగిందట... అందుకే అలా?
పీలేరులో ఇప్పటికే మండల స్థాయి టీడీపీ నేతలతో సమావేశాలను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నిర్వహించారు
పదేళ్లు గెలుపు ఊసే లేదు. సొంత ఇలాకాలోనే బ్రదర్స్ కు చుక్కెదురయింది. వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ నియోజకవర్గంలో నల్లారి కుటుంబం పట్టు ఏంటో తెలిసిపోయింది. అయితే పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లుగా అక్కడే గెలిచి తమ పట్టును నిరూపించుకోవాలనుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. 2009 లో పీలేరు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ది ఆఖరి గెలుపు.
వరసగా రెండు సార్లు....
2014లో తన సోదరుడు పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీ లో చేరిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఉన్న విభేదాలతోనే ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోసారి ఓటమి పాలయ్యారు.
రెండు చోట్ల....
అక్కడ చింతల రామచంద్రారెడ్డి రెండు సార్లు వరసగా గెలుస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుతో ఆయన హ్యాట్రిక్ సాధిస్తారు. అయితే పీలేరుపై పట్టు పెంచుకునేందుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వరసగా ఇక్కడ పర్యటనలు చేస్తున్నారు. పుంగనూరు, పీలేరు బాధ్యతలను చంద్రబాబు ఆయనకే అప్పజెప్పారు. పుంగనూరులో టీడీపీ ఇన్ ఛార్జిగా చల్లా బాబును నియమించినా, అంతా నల్లారి కనుసన్నల్లోనే జరుగుతుంది.
విస్తృతంగా పర్యటిస్తూ....
పీలేరులో ఇప్పటికే మండల స్థాయి టీడీపీ నేతలతో సమావేశాలను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నిర్వహించారు. త్వరలోనే ఆయన నియోజకవర్గంలో పాదయాత్రకు కూడా సిద్దమవుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఈసారి పీలేరే వైసీపీ అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చింతల రామచంద్రారెడ్డికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తుండటంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని పోటీకి దింపి మరోసారి నల్లారి కుటుంబానికి షాక్ ఇవ్వాలని ఇటు పెద్దిరెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. మరి ఈసారి అయినా నల్లారి బ్రదర్స్ కు పీలేరు అండగా నిలుస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story