Fri Dec 20 2024 01:56:06 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరిలోనూ కలవరమేనా?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ పేరు మార్చడం అంటే సాహసంతో కూడుకున్న చర్యే. రాజకీయంగా కొంత ఇబ్బందులు వస్తాయని కూడా జగన్ కు తెలుసు. అయినా ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రెండు దశాబ్దాలకు పైగా ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడం అంటే ఆషామాషీ కాదు. విమర్శలు వస్తాయని తెలుసు. దానిని రాజకీయంగా ఎదుర్కొనాల్సి వస్తుందనీ తెలుసు. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని కూడా జగన్ కు తెలియంది కాదు.
ఎన్టీఆర్ పేరును...
అయినా తగ్గలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ బిల్లు ఆమోదం పొందింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా ఇది అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఉన్న పళాన జగన్ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది వారి సందేహం. అయితే మొత్తం ఎపిసోడ్ లో మాత్రం ఇద్దరే ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా, సామాజికవర్గం పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ నిర్ణయంపై లోలోపల మధనపడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ బహిరంగంగా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. పార్టీ నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎగిరెగిరి పడుతున్న వారే. వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తుంటారు.
వంశీ ముందుగానే...
అయితే వల్లభనేని వంశీ ముందుగానే రియాక్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చవద్దని ఆయన జగన్ ప్రభుత్వాన్ని బతిమాలుకున్నారు. నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసమేనంటూ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించడం తగదని వల్లభనేని వంశీ అన్నారు. అంటే వంశీ ఒకరకంగా గొంతు సవరించుకున్నట్లేనని చెప్పాలి. కానీ ఏం చేయలేని పరిస్థితి. గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపులో ఈ అంశం కీలకంగా మారుతుందని వల్లభనేని వంశీ కలవరపడటంలో తప్పులేదు. అందుకే ఆయన ఆ మాత్రమైనా వెంటనే జగన్ ప్రభుత్వాన్ని అడగగలిగారు.
కొడాలి సైలెంట్...
ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఈ విషయంలో సైలెంట్ అయ్యారు. గుడివాడ కూడా కృష్ణా జిల్లాలోనే ఉంది. ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఇప్పటి తరం కాకపోయినా మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎన్టీఆర్ తమ వాడిగా భావిస్తుంటారు. అందుకే కొడాలి నానికి కూడా ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. నందమూరి కుటుంబం నుంచి కూడా ఎటాక్ మొదలయింది. దీంతో కొడాలి నాని ఏం చేయాలో పాలుపోక మౌనాన్ని పాటిస్తున్నారు. ఇన్నాళ్లూ జగన్ ను వెనుకేసుకొస్తూ, చంద్రబాబుపై ఒంటికాలి మీద లేస్తున్న కొడాలి నాని మాత్రం ఈ విషయంలో సైలెంట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Next Story