Wed Jan 08 2025 18:34:34 GMT+0000 (Coordinated Universal Time)
కవిత ఏం చేయబోతున్నారు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పేరు నెలలుగా వినిపిస్తుంది. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుపై ఉత్కంఠ నెలకొంది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పేరు కొన్ని నెలలుగా వినిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి మరీ విచారణ జరిపి వెళ్లిపోయారు. అయితే వరస అరెస్ట్‌ల నేపథ్యంలో కవిత రేపు విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆమె న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా తాను మరో రోజు హాజరవుతానని చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఈడీ అధికారులు కూడా అందుకు అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు. తన విచారణ హాజరుపై స్పష్టత ఇచ్చారు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాసినట్లు తెలిసింది. పదిహేనోతేదీన విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారని సమాచారం. విచారణకు తనకు సమయం కావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
పదో తేదీన...
ఇటీవల డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాకు నోటీసులు అందగానే తనకు ముఖ్యమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నాయని, తర్వాత వస్తానని చెప్పడంతో దానికి దర్యాప్తు సంస్థ అధికారులు అంగీకరించారన్న విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన మహిళలకు దేశంలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. మొత్తం 16 పార్టీల మహిళ నేతలతో కలిసి ఈ సమస్యపై ఆందోళన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తాను హాజరవుతానని చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. అందులో భాగంగానే 15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపారంటున్నారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాల్సి ఉంది.
కొత్త డ్రామాలంటూ...
మరోవైపు ఈ నెల 7వ తేదీన అరెస్టయిన రామచంద్రపిళ్లై చెప్పిన మేరకు తాను కవిత బినామీ అని చెప్పడంతో ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. తనకు ఈడీ నోటీసులు వస్తాయని ముందుగానే ఊహించి కవిత మహిళ రిజర్వేషన్ల పేరిట కొత్త డ్రామాలకు తెరలేపారంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. లిక్కర్ వ్యాపారం చేసి అక్రమ సంపాదనకు స్కామ్ లు చేస్తే ఈడీ నోటీసులు ఇవ్వదా? అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ నోటీసులతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. మొత్తం మీద కవిత రేపు విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది.అయితే ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానంటూ ఈడీకి కవిత లేఖరాసినట్లు తెలిసింది. అయితే రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను వాచారించాలనుకుంటున్న ఈ డీ అధికారులు కవిత విజ్ఞప్తిని ఎలా చూస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story