Fri Dec 20 2024 17:45:52 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్యా.. ఏం నోరయ్యా...?
నందమూరి బాలకృష్ణ తన కామెంట్స్ తో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా కూడా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు
నందమూరి బాలకృష్ణ ఎందుకు మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఎదురుగా కెమెరాలున్నాయన్న స్పృహ కూడా ఆయనకుండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం బాలయ్య నైజం. అది అనేక వివాదాలకు దారితీస్తుంది. ఇటీవలే అక్కినేని, ఎస్వీ రంగారావుల గురించి బాలయ్య మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అవి వివాదంగా మారడంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ఒక సామాజికవర్గానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
పవన్ ఎపిసోడ్ లో...
అనడమెందుకు.. బాధపడటమెందుకు? అన్న కామెంట్ బాలయ్య బాబుకు ఖచ్చితంగా సరిపోతుంది. అయితే ఇక్కడ అంటారు కాని బాధపడటం అనేది ఉండదు. తాజాగా నర్సులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆహాలో పవన్ కల్యాణ్ తో జరిగిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదంగా మారాయి. ఈసారి బాలయ్య నర్సుల గురించి అసభ్యకరంగా మాట్లాడటంతో కొన్ని సంఘాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
నర్సులపై...
పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఆయనకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై బాలయ్య మాట్లాడుతూ తాను కూడా గతంలో ప్రమాదవశాత్తూ గాయపడ్డానని తెలిపారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రికి వెళితే యాక్సిడెంట్ అని చెప్పవద్దని స్నేహితులు కోరారని అంటూ నర్సులపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. దీంతో నర్సుల సంఘం బాలయ్యను క్షమాపణలకు డిమాండ్ చేస్తుంది. బాలయ్య నోరుకు అడ్డూ అదుపూ ఉండదని మరోసారి రుజువైంది. ఆయన కామెంట్స్ ను సమర్థించేవారున్నా కొందరి మనోభావాలను మాత్రం ఆయన మాటలు ఎప్పుడూ దెబ్బతీస్తూనే ఉండటం తరచుగా జరగుతుంది.
Next Story