Mon Dec 23 2024 00:28:31 GMT+0000 (Coordinated Universal Time)
కరుణించమని కోరుకో... కనిపించమని కాదు
ఏపీలో బాలకృష్ణ పార్టీని పట్టించుకోవాల్సి ఉంది. ఆయనకు రాష్ట్రమంతటా అభిమానులున్నారు.ఎన్టీఆర్ ఇచ్చిన ఓటు బ్యాంకు ఉంది
అఖండ అద్భుతమైన విజయం సాధించింది. బాలయ్య బాబు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పర్యటించి అభిమానుల్లో మరింత జోష్ పెంచుతున్నారు. మరి పార్టీ సంగతేమిటి సామీ అని అడిగితే మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు. నందమూరి బాలకృష్ణ ఇప్పడు అఖండ మూడ్ లో ఉన్నారు. సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆయన విశాఖ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటున్నారు.
అద్వాన్నంగా ఉన్నా....
కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అద్వాన్నంగా ఉంది. తన బావ కన్నీరు పెట్టుకుని బోరుమన్నా కూడా బాలయ్య మనసు కరగలేదు. పార్టీని పూర్తిగా బాలకృష్ణ పట్టించుకోలేదు. తన సోదరిని అసెంబ్లీలో అవమానించారని ప్రెస్ మీట్ పెట్టడం తప్పించి బాలకృష్ణ పెద్దగా స్పందించింది లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. నాయకత్వంపైనే నమ్మకం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
రాజకీయాలకు దూరంగా....
ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ పార్టీని పట్టించుకోవాల్సి ఉంది. ఆయనకు రాష్ట్రమంతటా అభిమానులున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఇచ్చి వెళ్లిన ఓటు బ్యాంకు ఉంది. వీరందరినీ పార్టీ వైపు మళ్లించేలా బాలయ్య ప్రయత్నించాల్సి ఉంది. కానీ బాలకృష్ణ మాత్రం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారనే అనిపిస్తుంది. కనీసం ఏపీలో జరుగుతున్న ఏ పరిణామాలనైనా ఆయన లైట్ గానే తీసుకుంటున్నారనిపిస్తోంది.
ఎప్పుడూ అంతే అయినా...
బాలకృష్ణ ఎప్పుడూ అంతే. అధికారంలో ఉన్నా, లేకపోయినా పెద్దగా రాజకీయాలను పట్టించుకోరు. కానీ ఈసారి పరిస్థితులు వేరు. చంద్రబాబు ఒక్కడే పోరాటం చేస్తున్నారు. సీనియర్ నేతలు సయితం పార్టీకి పెద్దగా ఉపయోగపడటం లేదు. పార్టీ క్యాడర్ కూడా నైరాశ్యంలో ఉంది. అలాంటిది బాలకృష్ణ తన అఖండ మూవీపై చూపిన శ్రద్ధ పార్టీపై పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాను ప్రేమించే బాలయ్య అదే స్థాయిలో తన తండ్రి స్థాపించిన పార్టీని కూడా ప్రేమిస్తే బాగుంటుందన్న సూచనలు విన్పిస్తున్నాయి. అఖండలో బాలయ్య డైలాగ్ ఒకటి పేలిపోయింది. దేవుడిని కరుణమించమని కోరుకో... కనిపించమని కాదు. ఇప్పుడు క్యాడర్ కూడా బాలయ్య బాబును అదే కోరుకుంటున్నారు.
Next Story